నెగ్గిన యాదవ్ ల పంతం న్యూఢిల్లీ : లాలూ, ములాయాం, శరద్ యాదవ్ ల డిమాండ్ లకు ప్రభుత్వం తలొగ్గింది. మహిళాబిల్లుపై యాదవ్ త్రయం తమ పంతం నెగ్గించుకున్నారు. మహిళా బిల్లుపై వారు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం యాదవ్ త్రయానికి హామీ ఇచ్చింది. ఈ మేరకు మహిళా బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బిల్లుపై పలు రాజకీయ పక్షాలు అభ్యంతరాలను చర్చించేందుకు అఖిల పక్షం నిర్వహించాలని నిర్ణయించామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. బిల్లుపై ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్ వంటి రాజకీయ పక్షాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
బిల్లు కారణంగా ముస్లింలు, దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్న ములాయం, లాలూ, శరద్ యాదవ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజ్యసభలో ప్రవేశపెట్టినపుడు బిల్లును అడ్డుకునేందుకు యాదవ్ త్రయం నేతృత్వంలోని ఎస్పీ, ఆర్జేడీ, జెడియు పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. తాము మాత్రమే కాకుండా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు కూడా బిల్లు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని లాలూ వ్యాఖ్యానించారు. అంతేగాక తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోని యుపిఎకి మద్దతు ఉపసంహరిస్తామని యాదవ్ త్రయం హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో యాదవ్ ల ఒత్తిడికి, డిమాండ్లకు తలొగ్గిన కేంద్రం మహిళా బిల్లుపై అఖిలపక్షం సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
News Posted: 11 March, 2010
|