నిజం... చీకటి దాటుకు వచ్చేదెపుడు
నిజం.. నిజంగా.. నిజమయ్యేదెపుడు
నిజాలు మాత్రమే.. నలుదిక్కులా..
చేతనాన్ని నింపేదెపుడు
అబద్ధాలతో.. అందలాలు ఎక్కడం
లేని గొప్పలు.. పెద్ద పెద్దగా అచ్చేసుకోవడం
రంగులు అద్ది టీవీల్లో చూపెట్టడం
సాధ్యమే కాని కలల ప్రపంచాన్ని.. నమ్మబలకటం
నిజాలను పాతరేసి.. అబద్ధాలనే.. నిజాలు చేసి
కుర్చీల కోసం.. చరిత్రలనే... మార్చివేస్తుంటే
నిజం.. నీ వరకు వచ్చేదెపుడు
నిజాలన్నీ.. నిజాయితీగా రాసేస్తే
రాబందుల.. అసలు కథలు.. బజారుకీడిస్తే
రాజకీయం.. ఇంతగా రొమ్ము విరుచుకు తిరిగేదా?
నీరు లేక నీడ లేక
తినడానికి తిండిలేక.. బతుకులిలా బలి అయ్యేవా
రచయితల... కలాల్లో...
కులం మతం ప్రాంతం
ఏదో ఒక రాజకీయ భావజాలం.. పేరుకుపోతే
ఇక నిజం బయటికి వచ్చేదెపుడు?
ఈ తలరాతలు మార్చేదెవరు
అబద్ధాలను.. నిజాలుగా రాసి..
కత్తి కన్నా కలం గొప్పదనే..
అద్భుతమయిన బలాన్ని భావాన్ని..
ఆభాసు పాలు చెయ్యొద్దు