శ్రావణ మాసం లో శోభనరావు, శ్రీదేవిల కళ్యాణం అంగ రంగ వైభవం గా జరిగిపోయింది.
ఆ రోజే మొదటి రాత్రి. శోభనరావు జీవితం లో ఒక పదేళ్ళు ఆలస్యం గా వచ్చింది. రెండు రోజుల నుండి మొదటి రాత్రి నాడు తన భార్య చేత పాడించాల్సిన పాటలను ఒక లిస్టు గా రాసుకున్నాడు. మొత్తం ముప్పై పాటలు వచ్చాయి. గదిలోనికి వెళ్ళిన వెంటనే మొదలెడితే పొద్దున అయిదు గంటల కల్లా పూర్తి అవవచ్చునని ప్లాన్ చేసుకున్నాడు.
గదిలోనికి లీటరు పాల సీసాతో అడుగు పెట్టిన శ్రీదేవిని మంచం పై పక్కన కూర్చోబెట్టుకొని పాటల లిస్టు అందించి ఇక మొదలెట్టు అని ఆశగా అన్నాడు.
పది నిమిషాలైనా పాట మొదలు పెట్టలేదు శ్రీదేవి. మొదట్లో సిగ్గుగా వుందేమోనని కాస్త మంచి మాటలు చెప్పాడు. అరగంటైనా శ్రీదేవి నోరు మెదపకపోయేసరికి విసుగొచ్చి `త్వరగా పాటలు పాడు, టైమ్ వేస్టవుతోంది' అని అన్నాడు.
`గీత ఈ రోజు ఈ గదిలోనికి రాకూడదుటండీ' అని నెమ్మదిగా అంది శ్రీదేవి.
`గీత ఎవరు?' ఆశ్చర్యం గా అడిగాడు శోభనరావు.
`గీత నా ఫ్రెండు. నాకు పాటలు నేర్పిస్తోంది'
`నీకు పాటలు నేర్పించడమా! అంటే' ఏమీ అర్ధం కాక మధ్యలోనే ఆగిపోయాడు శోభనరావు.
|