Active Blogs | Popular Blogs | Recent Blogs నేను పుట్టినప్పుడు నాకేమి వినిపించలేదు.
నన్ను నేను మనిషిగా గుర్తించిన రోజు వినపడలేదు నువ్వు చెప్పిన మాటలు. కాని కళ్ళు బానే పని చేసాయి. ప్రకృతి కనపడింది.. నా మనుగడ సాగించడానికి ఒక ఆధారం దొరికింది.
పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్నీ ఒక్కసారిగా దొరికాయి నాకు. భలే బాగుంది.
ఎం చేయాలో తోచలేదు. ఒక పక్క సంతోషం, మరో పక్క నేనేదో కనిపెట్టానన్న ఉత్సాహం.
ఏది ఎలా వాడుకోవాలో నాకు తెలిసింది. ఎలా బ్రతకాలో నేనే అందరికన్నా ముందుగా నేర్చుకుంది. అది నా మొట్ట మొదటి విజయం.
నేను గెలిచానన్న సంతోషమో లేక వేరొకర్ని ఓడించానన్న విజయ గర్వమో… నన్ను మళ్లీ మళ్లీ పోరాడేలా చేసింది. మళ్లీ మళ్లీ వచ్చే గెలుపు నాకొక వ్యసనం గా మారింది.
పులి మీద స్వారి లాగా..ఒకసారి మొదలు పెడితే తిరిగి చూడలేని పరిస్థితి.
ఆగితే… వెనక్కి తిరిగి చూస్తే… నాకేమైనా అయిపోతుందనే భయం. నా తెలివి తేటలు, నా గెలుపు, ఏవి నా భయాన్ని పోగొట్టలేకపోయాయి . అది బయట పడకుండా ఉండేందుకు నన్ను నేను నాయకుడ్ని చేసుకున్నాను.
నేను చెప్పిందే వినాలని శాశించాను. నా కుటుంబంతో మొదలు పెట్టి , ఒక్కొక్కటిగా అందర్నీ, అన్నింటిని నా అదుపులోకి తెచ్చుకున్నాను.
నన్ను ఎవరూ తాకక ముందే నా చుటూ కోట నిర్మించుకున్నాను.
నాలోని భయాన్ని దాచుకునేందుకు ఎదుటి వాణ్ణి భయపెట్టాను.
నా ఆకలిని తీర్చుకునేందుకు ఆకలితో ఉన్న జీవిని తిన్నాను.
నాకు నేనే కట్టుబాట్లని గీసుకున్నాను. కాదు అన్న వారిని కనపడకుండా చేశాను.
నా తెలివి తేటలకి నన్ను నేనే మెచ్చుకున్నాను.
ఆగని పరుగులా .. ఒక దాని వెంట మరొకటి..చేజిక్కించుకుంటూనే పోయాను.
ప్రాణం ఉన్న జీవిని, ప్రాణం లేని రాళ్ళని, కదిలే నదిని, కదలలేని చెట్లని .. దేన్నీ వదలకుండా నా సొంతం చేసుకున్నాను. అన్నిటినీ నా ఇష్ట ప్రకారం నడిపించాను.
నేను బ్రతికాను, నేను ఆనందించాను..నేను ఎదుగుతూనే ఉన్నాను.
ఈ మధ్యలో నిన్ను మర్చిపోయాను. నేను ఎదగటం కోసం నిన్ను తున్చేస్తున్నాను అని మర్చిపోయాను.
ఇప్పుడు విరిగి పడ్డ నీ రెక్కలని చూసి విసుక్కుంటున్న నేను.
నాకు సంబంధించి, నువ్వు దయ లేని ప్రకృతివి.
ఎక్కడ ఉండాలో తెలియని వనానివి.
ఎక్కడ కురవాలో ఎంత కురవాలో లెక్క లేని మేఘానివి .
ఎంత దూరం పారాలో దారి తెలియని వరద నీటివి.
నా చేతలకి నీ కడుపెంత మండినా , నువ్వెంత ఏడిచినా , నువ్వు కరిగిపోకూడదు అనే నా స్వార్దానికి సాక్ష్యానివి.
నీకూ నాలాగే బ్రతకాలని ఉందా? మరి నాకేమో ఇప్పుడీ జీవితం బాగోలేదు అనిపిస్తుంది.
నాకో సాయం చెయ్యి. నేను నీ కన్నా గొప్ప కాదని నిరూపించు.
నన్ను మరలా పుట్టించు.
కాని, ఈ సారి నాకు కేవలం ప్రాణం మాత్రమే పొయ్యి.
నా ఇష్ట ప్రకారం ఏదైనా చేసుకునే స్వేచ్చను నాకు ఇవ్వకు.
నన్ను నాయకుడ్ని కానివ్వకు.
సృష్టిలో… సజీవంగా, నిర్జీవంగా, ఉండే ప్రతీ దాన్ని అధమంగా మార్చేసే నా జన్మను ఉత్తమంగా చేయకు.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|