నృత్య కళామతల్లికి ప్రీతిపాత్రమైనది గ్రామం కృష్ణా జిల్లాలోని కూచిపూడి. ఆ
గ్రామమే నాట్య సరస్వతీ నిలయం. అక్కడ నిత్యం నటరాజు తాండవం చేస్తుంటాడు.
సిద్ధేంద్రయోగి కలలరూపం కూచిపూడి నాట్య సంప్రదాయం. అక్కడ ప్రతీ కుటుంబం ఆ
నాట్య కళామతల్లి సేవలో తరిస్తుంటుంది.
తెలుగు వారి కళా వైభవానికి చిహ్నమైన ఆ కూచిపూడి గ్రామంలో నాట్యానికి
అంకితమైన కుటుంబంలో వేదాంతం రామయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు లభించిన నటరాజ
ప్రసాదం రాఘవయ్య. అయిదు సంవత్సరాల లేత వయసులో చింతా వెంకటరామయ్య గారి
శిష్యరికం లభించింది. రాఘవయ్య గారికి నాట్యం మీద ఆసక్తి, అంకిత భావం
కలిగించడానికి గురువు గారి పాత్ర ప్రధానమైనది. దాంతో ఆయన ప్రతిభ
బహుముఖాలుగా విస్తరించింది. నాట్యం, సంగీతం, నటనలతో బాటు తాళజ్ఞానం అపారంగా
లభించింది.




