Active Blogs | Popular Blogs | Recent Blogs -----------------------------------------------------------------------------------------------------------------------------------------------
దళితులకు జరిగే అన్యాయాలపై ప్రతిఘటనకు పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టాలని, కుల వివక్ష తుదముట్టించేందుకు
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఉన్నతాధికారుల పోరం తీర్మానించింది. ఆ వివరాలు మీకోసం.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------
షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ఉద్యోగులకు ప్రమోషన్లు, పోస్టింగుల విషయంలో వివక్ష ప్రదర్శిస్తున్న అగ్రకులస్తుల ఆగడాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి రోశయ్యకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కు నివేదిక సమర్పించాలని ఆంధ్ర ప్రదేశ్ యస్సీ యస్టీ ఉన్నతాధికారుల సామాజిక న్యాయ వేదిక కన్వీనర్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు నిర్ణయించారు. ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న ఐపియస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సన్మాన సభలో ఆయన ముఖ్య ఆతిధిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లోని అంబేద్కర్ భవన్ లో జరిగిన ఈ ఆత్మీయ అభినందన సభలో పలు జిల్లాల నుంచి వచ్చిన వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ శాఖాపరంగా దళితులకు జరిగే అన్యాయాలను ఎదిరించి పోరాడేందుకు విశ్రాంత ఐఏయస్, ఐపియస్ అధికారుల నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. యస్సీ, యస్టీ ఉప-ప్రణాళిక నిధుల కేటాయింపులో ఏయేటికాయేడు చోటుచేసుకుంటున్న అవకతవకలను సరిచేసేందుకు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేలా ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తూ రాష్ట్రంలోని ప్రతి దళితుడూ ఒక పోస్ట్ కార్డ్ రాయాలని పిలుపు నిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీలు నిర్వహించాలని, స్థానిక ప్రజా ప్రతినిధులను, విద్యావంతులను, సామాజిక సేవా రంగాలలో కీలక పాత్రపోషిస్తున్న ప్రముఖులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని మాధవరావు సూచించారు. దళితులకు, సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు సరయిన రీతిలో సత్వర న్యాయం జరగాలంటే సంక్షేమ పథకాలను అమలు పరిచే విభాగాలకు అధిపతులుగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన అధికారులనే నియమించేలా వత్తిడి పెంచక తప్పదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అభిప్రాయపడ్డారు. దళిత, గిరిజన జాతులకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వైయస్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును మార్చి నెల పదవ తేదీకే పరిమితం చేయకుండా మరికొంత కాలం పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఫోరం సమావేశల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ లో వృత్తివిద్యా తరగతులు అభ్యసించే విద్యార్థులకు పూర్తి ఫీ రీయంబర్స్ మెంట్ సదుపాయాన్ని కల్పించించినందుకు ముఖ్యమంత్రి రోశయ్యకు ఆయన కృతఙ్ఙతలు తెలిపారు.
అంతకుముందు జరిగిన ఫోరం నెలవారీ సమావేశంలో కూడా పలువురు అధికారులు దళితులకు జరుగుతున్న అన్యాయాలపై తీవ్ర స్వరంతో బాహాటంగానే స్పందించారు. దళితులకు రాజ్యాంగబద్దంగా చెందాల్సిన ప్రయోజనాలకు గండికొట్టే అగ్రకుల దురహంకార, అప్రజాస్వామిక పోకడలను యస్సీ,యస్టీ అధికారుల ఫోరం తప్పుపట్టింది. కళ్ళెదుట అన్యాయం జరుగుతున్నా చూస్తూ సహించడం తప్ప ఇదేమని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో గ్రామీణ నిరుపేద దళితుల దుర్భర జీవనం కొనసాగడం పట్ల ఫోరం ఆవేదన వ్యక్తంచేసింది. కుల వివక్షను అంతమొందించేందుకు, అవమానాలను ప్రతిఘటించేందుకు చేపట్టే దళితుల ఆత్మగౌరవ ఉద్యమాలకు మేధావులు సిద్దపడాలని ఫోరం తీర్మానించింది.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|