కొన్ని ప్రిస్టేజియస్ చిత్రాలకు మరింత క్రేజ్ తెచ్చేందుకు దర్శకనిర్మాతలు కొన్ని ప్రత్యేకతలను జోడిస్తుంటాడు. ఇందులో భాగంగానే హీరోలు అడపాదడపా గొంతు సవరించుకుని ఓ పాటేసుకుంటారు. విక్రమ్ కథానాయకుడుగా సుశీ గణేషన్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను అత్యంత భారీ బడ్జెడ్ తో రూపొందిస్తున్న చిత్రం 'మల్లన్న'. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. తమిళంలో 'కందసామి' పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంతో విక్రమ్ తొలిసారి గాయకుడిగా కూడా అవతార మెత్తుతున్నారు. సంగీత యువతరంగం దేవీశ్రీప్రసాద్ ఈ ద్విభాషా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విక్రమ్ లో మంచి గాయకుడు కూడా ఉన్నాడని తెలుసుకున్న దేవీశ్రీ ఈ చిత్రంలోని 6 పాటల్లో 4 పాటలను విక్రమ్ చేత పాడించారు. అంటే తొలి ప్రయత్నంలోనే విక్రమ్ ప్రొఫెషనల్ సింగర్ గా మారినట్టు అనుకోవచ్చు. 'కందసామి' కోసం ఈ పాటలు విక్రమ్ పాడారు. అయితే తెలుగు వెర్షన్ లో కూడా విక్రమ్ నేపథ్యగానం అందిస్తారా అనేది ఇంకా నిశ్చయం కాలేదు.
విక్రమ్ ఈ చిత్రంలో 12 ప్రత్యేక గెటప్ లలో కనిపించబోతున్నారు. వీటిలో లేడీ గెటప్ కూడా ఉంది. శ్రియ కథానాయిక. తెలుగు సూపర్ స్టార్ కృష్ణ సిబిఐ ఆఫీసర్ గా రెండు భాషల్లోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రం చెన్నై సిటీ రైట్స్ ను ఎగ్జిబిటర్ అభిరామి రామనాథన్ రూ.4 కోట్ల 1 లక్షకు కొనుగోలు చేయడం ఈ చిత్రంపై మరిన్ని అంచనాలకు దారితీస్తోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు పట్టుదలగా ఉన్నారు.