'ఖాకీ'ల వార్
సంక్రాంతి సినిమాల పోటీ నెమ్మదించి చిన్న చిత్రాలు, మీడియం రేంజ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వారం ఇద్దరు కాప్ లు (పోలీసులు) ఒకరోజు తేడాతో పోటీపడనున్నారు. ఈ ఇద్దరూ పోలీస్ పాత్రలతో కొన్ని విజయాలను సొంతం చేసుకున్నవారే. ఇద్దరూ సీనియర్ నటులే. వీరిలో ఒకరు జగపతిబాబు, మరొకరు డాక్టర్ రాజశేఖర్. 12న జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'సిద్ధం' చిత్రం విడుదలవుతోంది. 13న డాక్టర్ రాజశేఖర్ 'సత్యమేవ జయతే' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జగపతిబాబు కథానాయకుడుగా జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో కిరణ్ కుమార్ కోనేరు 'సిద్ధం' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో జగపతిబాబు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తారు. 'డాక్టర్లు వైద్యం చేస్తారు. ఇంజనీర్లు నిర్మిస్తారు. నేను చంపుతాను' అనేది సినిమాలో ఆయన స్లోగన్. చివరిసారిగా ఆయన 'లక్ష్యం' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేశారు. ఆ పాత్రకు ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డును కూడా జగపతిబాబు గెలుచుకున్నారు. ఇక డాక్టర్ రాజశేఖర్ రెండేళ్లు కష్టపడి సొంత బ్యానర్ లో హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'సత్యమేవ జయతే'. జీవితా రాజశేఖర్ దర్శకురాలు. గతంలో 'అంకుశం' వంటి పలు చిత్రాల్లో రాజశేఖర్ నటించిన పోలీసు పాత్రలకు మంచి పేరు వచ్చింది. కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ 'సత్యమేవ జయతే'లో ఆయన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. హిందీ 'ఖాకీ' చిత్రానికి ఇది రీమేక్. అయితే అందులోని సెంట్రల్ పాయింట్ నే తీసుకుని ఈ సినిమా రూపొందించినట్టు రాజశేఖర్ చెబుతున్నారు. 'ఎవడైతే నాకేంటి', 'గోరింటాకు' వంటి హిట్స్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి హ్యాట్రిక్ హిట్ వస్తుందనే గట్టి నమ్మకంతో ఆయన ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లుగా జగపతిబాబు, రాజశేఖర్ లలో ఎవరు ఎక్కువ మార్కులు గెలుచుకుంటారనేది ప్రస్తుతం సినీగోయెర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Be first to comment on this News / Article!
|