'బంగారుబాబు' సాంగ్స్
జగపతిబాబు, మీరాజాస్మిన్ జంటగా శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'బంగారుబాబు'. జొన్నలగడ్డ శ్రీనివవాసరావు దర్శకుడు. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం సాయంత్రం తాజ్ డక్కన్ లో జరిగింది. దాసరి, డివిఎస్ రాజు, డి.రామానాయుడు, వి.బి.రాజేంద్రప్రసాద్్, దేవీ వర ప్రసాద్, జగపతిబాబు, శశాంక్, జయసుధ, మురళీమోహన్, శ్రీలేఖ, ఆర్.నారాయణమూర్తి, సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ డి.రామానాయుడు ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి దాసరికి అందించగా, డివిఎస్ రాజు ఆడియో సీడీని ఆవిష్కరించి వి.బి.రాజేంద్రప్రసాద్ కు అందజేశారు. మయూరి ఆడియో ద్వారా సాంగ్స్ మార్కెట్ లోకి విడుదలయ్యాయి.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ, తాను ఏ సినిమా తీసినా ఒకసారి వాడిన టైటిల్ ను మళ్లీ ఉపయోగించడం జరగలేదనీ, అయితే ఈ సినిమా కోసం తొలిసారి బంగారుబాబు టైటిల్ ను వాడటం జరిగిందన్నారు. మరణశయ్యపై ఉన్న తన తండ్రి కోరికను తీర్చేందుకు ఒక కొడుకు ఎలాంటి తపన పడ్డాడనేదే ఈ చిత్ర కథనీ, చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో ఉన్నాయనీ చెప్పారు. తెలుగు పరిశ్రమలో ఎంతో మంచి క్రమశిక్షణ ఉన్న నటుడు జగపతిబాబు అనీ, జగపతిబాబు కెరీర్ లోనే అత్యుత్తమ నటనను ఈ చిత్రంలో కనబరచారనీ ప్రశంసించారు. జగపతిబాబు మాట్లాడుతూ, దాసరి చాలా గొప్ప నిర్మాతనీ, తన యూనిట్ సభ్యుల కోసం ఎంత డబ్బు ఖర్చుచేయడానికైనా వెనుకాడరనీ అన్నారు. ఈ చిత్రం కోసం కాశ్మీర్ లో షూటింగ్ జరిగినప్పుడు తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దాసరి చొరవ తీసుకుని తమందరినీ విమానంలో కాశ్మీర్ నుంచి హైదరాబాద్ కు సురక్షితంగా రప్పించారని చెప్పారు. ఈ చిత్రంలోని సాంగ్స్ అన్నీ బాగున్నాయనీ, దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావుకు మంచి ఫ్యూచర్ ఉందనీ అన్నారు. ఇందులో ఒక పాట మినహా అన్నీ మెలోడీ ప్రధానంగా ఉంటాయనీ, బ్రౌక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చిందనీ శ్రీలేఖ తెలిపారు. ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రను పోషించినట్టు జయసుధ పేర్కొనగా, ఇందులో చాలా ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించినట్టు శశాంక్ తెలిపారు. ఈ చిత్రం చక్కిటి ఫ్యామిలీ డ్రామా, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ ప్రధానంగా ఉంటుందని జొన్నలగడ్డ శ్రీనివాస్ తెలిపారు. దాసరి తీసిన 'కుంతీపుత్రుడు', 'పుణ్యభూమి నాదేశం' వంటి చిత్రాలకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాననీ, ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బంగారు అవకాశాన్ని దాసరి తనకు ఇచ్చారనీ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|