బోర్డర్ దాటుతున్న మగధీర
కార్పొరేట్ స్థాయి మార్కెట్ వ్యూహంతో 'గజనీ' చిత్రాన్ని భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే 250 కోట్ల గ్రాస్ కు తీసుకువెళ్లిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇప్పుడు రామచరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'మగధీర' చిత్రాన్ని కూడా బోర్డర్ దాటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'చిరుత' చిత్రంతో చిరంజీవి నట వారసుడుగా కమర్షియల్ సక్సెస్ ను అందిపుచ్చుకున్న రామ్ చరణ్ రెండో సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఇంతవరకూ ఫెయిల్యూర్స్ ఎరుగని రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అల్లు అరవింద్ సైతం ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ వెచ్చిస్తున్నారు. ఇప్పటికే సుప్రీం మ్యూజిక్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ తో ఆడియో రైట్స్, ఓవర్సీస్ పంపిణీ హక్కులు దక్కించుకుంది. మార్చి మొదటివారంలో ఆడియో రీలీజ్ చేసి మొదటిరోజే 5 లక్షల ఆడియోలు మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతోంది. ఈ తరుణంలో మూడు భాషల్లో ఒకేసారి సినిమా రీలీజ్ చేయడం ద్వారా కలెక్షన్ల సునామీ తథ్యమని అల్లు అరవింద్ ఆలోచనలో తెలుస్తోంది.
'మగధీర' చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇందుకోసం ఏర్పాటు చేసిన భారీ సెట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఖర్చుతో ఈ సెట్స్ రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కాజోల్ జంటగా నటిస్తుండగా, శ్రీహరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా 'మగధీర' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Be first to comment on this News / Article!
|