30 అడుగుల అనుబంధం: దాసరి
నటరత్న ఎన్టీఆర్ తో తనకు 30 అడుగుల అనుబంధం ఉందంటూ డాక్టరర్ దాసరి నారాయణరావు ఆయనతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. 2007 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డును దాసరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో దాసరి తన స్పందనను తెలియజేశారు. ఎన్టీఆర్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయన, తాను ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్లమనీ, తమ అనుబంధం 30 అడుగులేననీ అభివర్ణించారు.
ఎన్టీఆర్ తో తాను ఐదు సినిమాలు చేశాననీ, అయితే అవన్నీ పేరుతెచ్చిన సినిమాలేననీ చెప్పారు. 'మనుషులంతా ఒక్కటే', 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలిపులి' చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలుసునని అన్నారు. 'సర్దార్ పాపారాయుడు' చిత్రం షూటింగ్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ నటించినప్పుడు తాను ఆయన పాదాభివందనం చేశాననీ, ఆయన భారతదేశంలోనే మహోన్నత నటుడనీ కొనియాడారు. పౌరాణిక,. జానపద, సాంఘిక చారిత్రాత్మక చిత్రాలకు సంబంధించి ఏ పాత్ర పోషించినా ఆయనకు ఆయనే సాటని అన్నారు. చిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తర్వాత ఏదైనా ప్రతిష్ఠాత్మక పురస్కారం ఉందంటే అది ఎన్టీఆర్ జాతీయ అవార్డు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును తనకు ప్రకటించడం ఎనలేని సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|