'మెగాస్టార్'కు దగ్గరగా హీరో రాజశేఖర్ వచ్చేశారు. ఈ పోలీక ఏమిటా అని ఆశ్యర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఆయన 'మహాస్టార్' (పైన కిరీటం కూడా ఉంది)గా రూపాంతరం చెందారు. ఇంతవరకూ రాజశేఖర్ పేరును యాంగ్రీ యంగ్ మాన్ గానే పిలవడం పరిపాటైంది. యాక్టింగ్ పవర్స్ తగ్గకపోవచ్చు కానీ ఎప్పుడూ యంగ్ గా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు కదా. బహుశా దానిని దృష్టిలో పెట్టుకునే ఆయన తాజా చిత్రం
'సత్యమేవ జయతే' టైటిల్ కార్డ్స్ లో రాజశేఖర్ పేరుకు ముందు 'మహాస్టార్' అని వేశారు. ఇక నుంచి ఆయన్ని అలాగే సంబోధించాల్సి కూడా రావచ్చు. కాకపోతే..మెగాస్టార్ కు దగ్గరగా మహాస్టార్ అనేది ఉండటమే ఇప్పుడు పలువురు దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశమవుతోంది.
ప్రొఫెషనల్ రైవలరీ అనేది నటీనటులకు సహజమే అంటారు. అలాంటి రైలవరీనే చిరంజీవితో రాజశేఖర్ కు ఉంది. అప్పుడెప్పుడో రాజశేఖర్ రీమేక్ చేద్దామనుకున్న 'ఠాగూర్' చిత్రాన్ని చిరంజీవి హైజాక్ చేశారు. ఆ రైట్స్ తనవేనని రాజశేఖర్ ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా వాపోతూనే ఉంటారు. దానికి కొనసాగింపుగా రాజకీయాల్లో చిరంజీవికి అనుభవం లేదు కాబట్టి ఆయన పార్టీలో (ప్రజారాజ్యం)లో చేరేది లేదని రాజశేఖర్ ఇటీవల తేల్చిచెప్పడం చిరు 'సేన'కు ఆగ్రహం తెప్పించింది. భీమవరం నుంచి హైద్రాబాద్ వరకూ ఆయనను చిరంజీవి అభిమానులుగా చెప్పుకునే కొందరు వెంటాడిన వ్యవహారం ఈమధ్య సంచలనం సృష్టించింది. ఇందులో తమ ప్రమేయం లేదని వివరణ ఇచ్చి రాజశేఖర్ కు చిరంజీవి స్వాంతన కలిగించారు. అయితే ఇప్పటికీ రాజశేఖర్ దంపతుల ఆగ్రహం చల్లారలేదనీ, తాజాగా 'సత్యమేవ జయతే' చిత్రంలో సంభాషణల రూపంలో పరోక్షంగా చిరంజీవిపై అక్కసును వెళ్లగక్కడమే ఇందుకు నిదర్శనమనీ కొందరు విశ్లేషిస్తున్నారు. ఒక పోస్టర్ లో తనతో పాటు మదర్ థెరిస్సా ఫోటో వేసుకున్న క్యారెక్టర్ నటి అపూర్వతో 'మదర్ ఏమైనా నీకు ప్రమోటరా? ఛారిటీ అనేది ఇంట్లోంచే మొదలవ్వాలి' అని రాజశేఖర్ విరుచుకుపడతారు. మరో సందర్భంలో 'పనికి మాలిన పార్టీలు చాలానే పుట్టుకొచ్చాయ్...పోయి వాటిలో చేరు' అనే ప్రయోగమూ ఉంది. రాజశేఖర్ ఈ చిత్రానికి సంభాషణల క్రెడిట్ కూడా ఇచ్చుకున్నారు కాబట్టి...ఆయనే కలం పట్టారని అనుకోవచ్చు. రాజశేఖర్ ఇంకా చల్లబడలేదని కూడా నిర్దారించుకోవచ్చు.