15 రూపాయలకే 50 కోట్లు
అక్షరాలా 50 కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన మూడు సినిమాలు దొడ్డిదారిన 15 రూపాయలకే పైరసీ డీవీడీ రూపంలో బయటకు రావడం నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన నిర్మించిన 'అరుంధతి' చిత్రం జనవరి 16న విడుదలకే మంచి సక్సెస్ ను సాధించింది. ఆ చిత్రం పైరసీదారుల బారిన పడుకుండా ఆయన గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ పైరసీదారులు ఏదో రూపంలో సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు. ఈ తరహా పైరసీ వల్ల పరిశ్రమ మనుగడకు తీవ్ర విఘాతం ఏర్పడుతోందని శ్యాంప్రసాద్ రెడ్డి ఆదివారంనడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
'దిల్ సుక్ నగర్ లో శుక్రవారం పైరసీ జరుగుతున్నట్టు సమాచారం అందింది. ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్నాం. మరుసటి రోజు ఉదయం శోభన్ అనే వ్యక్తి కారులో డివిడి బాక్స్ తో వచ్చాడు. అతనే వీడియో షాపులకు, పార్టీలకు పైరేటెడ్ డీవీడీలు సప్లయి చేస్తున్నాడని తెలిసింది.
అరుంధతి, మస్కా , కింగ్ చిత్రాలు కలిపి ఉన్న డివీడీని కేవలం 15 రూపాయలకే అతను విక్రయిస్తున్నాడు. ఈ మూడు సినిమాలకు అయిన నిర్మాణ వ్యయం సుమారు 50 లక్షలు. పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అతను పంపిణీ చేస్తున్న 62 దుకాణాల వివరాలు చెప్పాడు. ఇలా నిర్మాతల సొమ్ముకు పైరసీ చెదలు పడుతుంటే కొత్తదనంతో పెద్ద బడ్జెట్ సినిమాలు ఎలా తీయగలుగుతాం?' అని శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. పైరసీ వల్ల సుమారు కోటి మంది జనం థియేటర్లకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు ఇప్పుడు ఇంటర్నెట్ పైరసీ కూడా సరికొత్త బెడదగా మారుతోందన్నారు. విద్యావంతులైన యువకులు తమ ఫ్రెండ్స్ తో లింక్స్ షేర్ చేసుకునేందుకు ఇంటర్నెట్ లో సినిమాలు అప్ లోడ్ చేస్తున్నారనీ, అవి క్రమంగా అందరికీ చేరుతూ కొత్త సినిమాలు పైసా ఖర్చు లేకుండానే డౌన్ లోడ్ అవుతున్నాయని అన్నారు. థ్రిల్ కోసం కొందరు చేసే ఇలాంటి పనుల వల్ల పరిశ్రమ నష్టపోతోందన్నారు. దొంగిలించిన బైకు 5 వేలకు కొనాలంటే పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారనీ, పైరసీ డీవీడీలు చూడటం కూడా అలాంటి నేరమేనననీ అన్నారు. పైరసీ విషయంలో పోలీసులు తమను పట్టుకోరనే అభిప్రాయం వల్లనే ఈ బెడద తీవ్రమవుతోందన్నారు. పైరసీ వీడియోను చూసే వాళ్లను అరెస్టు చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం తమిళనాడులో ఉందన్నారు. సినీ ప్రియులు థియేటర్లలో కానీ, ఒరిజినల్ డీవీడీలు కానీ చూడాలని తాను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|