ఛార్మితో తారకరత్న పోటీ
నందమూరి హీరోల్లో ఇంతవరకూ సరైన హిట్ దొరకని తారకరత్న కొద్ది గ్యాప్ తర్వాత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 'ఒకటో నెంబర్ కుర్రోడు', 'భద్రాద్రిరాముడు' వంటి పలు చిత్రాల్లో నటించిన తారకరత్న తాజాగా 'వెంకటాద్రి' చిత్రం ద్వారా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై వి.సముద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆసక్తి కరంగా, ఇదే రోజు ఛార్మి నటించిన '16 డేస్' చిత్ర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'మంత్ర' చిత్రానికి గత శనివారంనాడే ఉత్తమ నటిగా ఛార్మి నంది అవార్డు అందుకోవడంతో సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు పెరిగిన డిమాండ్ కూడా ఈ సినిమాకి మంచి ఓపినింగ్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. తారకరత్న సైతం ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దిగడం, నందమూరి అభిమానులకు దగ్గర కావడంతో సహజంగానే ఈసారి ఆయనకు కలిసి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'వెంకటాద్రి', '16 డేస్' చిత్రాలతో పాటు నితిన్ 'ద్రోణ' చిత్రాన్ని కూడా ఇదే రోజు (20న) బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ట్రయాంగిల్ పోటీ అనివార్యమవుతుంది. ఈ మూడింటితో పాటు ఇప్పటికే 20న విడుదల తేదీ ప్రకటించిన చిత్రాల్లో కామెడీ నటుడు రఘుబాబు హీరోగా రూపొందిన 'మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు', శివాజీ-కావేరీ ఝా జంటగా నటించిన 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్' కూడా ఉన్నాయి. మార్చిలో పరీక్షల సీజన్ కావడంతో ఈనెలలోనే సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నందు గట్టిపోటీ కనిపిస్తోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Be first to comment on this News / Article!
|