యంగ్ జనరేషన్ హీరోలలకు సైతం హిట్లు ఇవ్వగలిగిన పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ కు ఓ హిట్టివ్వాలనే కోరిక మాత్రం అందని ద్రాక్షగానే మిగులుతోంది. కొద్దికాలం క్రితం సాయిరాంను '143' చిత్రం ద్వారా హీరోగా పూరీ పరిచయం చేశారు. 'ఆంధ్రావాలా' ఫ్లాప్ తర్వాత మరో ఫ్లాప్ గా ఈ చిత్రం వచ్చిచేరింది. ఓ దశలో దిల్ రాజుకు సాయిరాంను అప్పగించాలనే ప్రయత్నం కూడా పూరీ చేశారు. ఇందుకోసం సాయిరాం శంకర్ సిక్స్ ప్యాక్ డవలప్ చేశారు. సాయిరాంతో 'కొత్త బంగారులోకం' సినిమాకు దిల్ రాజు ప్లాన్ చేసినట్టు కూడా అప్పట్లో బలంగా వినపడింది. అయితే ఆ ప్రాజెక్ట్ చివరకు వరుణ్ సందేశ్ చేతుల్లోకి వెళ్లడం, సినిమా హిట్ కావడమూ జరిగిపోయాయి. ఎట్టకేలకు పూరీనే స్వయంగా సాయిరాంతో 'మీనాచ్చి' అనే సినిమాకు ప్లాన్ చేశారు. రవితేజ 'నేనింతే' సినిమా తర్వాత వెంటనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని కూడా పూరీ ప్రకటించారు. అయితే 'నేనింతే' ఫ్లాప్ తో పూరీ ప్లానింగ్ లోనూ మర్పులు చోటుచేసుకున్నాయి. సాయిరాం సినిమా పక్కనపెట్టి మళ్లీ ప్రభాస్ తో కొత్త సినిమాకి ఆయన ప్లాన్ చేస్తున్నారు. దీంతో మళ్లీ సాయిరాం శంకర్ కథ మొదటికి వచ్చింది. అయితే ఈసారి మాత్రం తన తమ్ముణ్ణి పూరీ నిరాశపరచబోవడం లేదు. తన తమ్ముడితో తీయాలనుకున్న సినిమా బాధ్యతను దర్శకుడు తులసీరామ్ కు అప్పగించారు.
'మంత్ర' సినిమాతో మంచి హిట్ కొట్టిన తులకీరామ్ ఇంతవరకూ రెండో సినిమా టెకప్ చేయలేదు. ఈ క్రమంలో పూరీ పిలిపించి సాయిరాం శంకర్ సినిమాను ఆయనకు అప్పగించారు. ఈ చిత్రాన్ని వైష్ణవి అకాడమీ బ్యానర్ పై పూరీ సొంతంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. సాయిరాం శంకర్ కు ఈసారైన సరైన సక్సెస్ దొరికితే మంచిదే.