ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తుల్లో రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఒకరు. 'ఆపరేషన్ దుర్యోధన' వంటి పొలిటికల్ సెటైర్ తీసి సక్సెస్ అయిన పోసాని ఆ తర్వాత 'ఆపద మొక్కులవాడు' చిత్రంతో చేతులు కాల్చుకున్నారు. దాసరి నారాయణరావు వల్లే ఒకరోజు ఆలస్యంగా ఆ చిత్రం విడుదలై తనకు తీరని నష్టం జరిగిందంటూ వీరంగం చేశారు. ఈయనకేమైనా మెంటలా అన్నవాళ్లకు సమాధానంగా 'మెంటల్ కృష్ణ' తీశారు. ఎలాగో సినిమాను 50 రోజులకు చేర్చారు. తాజాగా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా మరో సినిమాకి శ్రీకారం చుడుతున్నారు. షరా మామాలుగా ఇది కూడా రాజకీయ సంబంధిత చిత్రమే. ఆయనే హీరో. సినిమా పేరు 'రాజావారి చేపల చెరువు'. పేరేమిటి వింతగా ఉంది? అని అడిగితే అదే ఈ సినిమా స్పెషాలిటీ అంటున్నారు.
సహజంగా ఒక వెరైటీ చేప ట్యాంక్ లో పెరుగుతుంటుంది. అయితే రాజా వారి చెరువులో చాలా రకాల చేపలు పెరుగుతుంటాయి. అసలు రాజాగారు ఎవరు? చేప కథేంటి? తెలుసుకోవాలంటే నేను తీసే సినిమా చూడాల్సిందేనని పోసాని చెబుతున్నారు. ఇందులో పోలీసు ఆఫీసర్ గా ఆయన నటించబోతున్నారు. ఇటీవల పోసాని 'ప్రజారాజ్యం' పార్టీలో చేరిన నేపథ్యంలో చిరంజీవికి అనుకూలంగా సినిమా ఉండొచ్చా అని అడిగితే 'ఏ పార్టీని విమర్శించడం కానీ సమర్ధించడం కానీ మా సినిమాలో ఉండదు' అని తేల్చిచెబుతున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుపుతున్న పోసాని ఈనెల 20న ఈ కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నారు.