బాలకృష్ణ పాట లీకయ్యింది!
ఏ సినిమా అయినా రిలీజ్ కు నెల రోజుల ముందుకు ఆడియో విడుదల కావడం, ఆడియో హిట్టయితే సినిమా సగం హిట్టయినట్టేనని నిర్మాతలు ధీమా వ్యక్తం చేయడం పరిపాటి. ఇప్పుడు కొన్ని సవరింపులు కూడా చేసుకోక తప్పేలా లేదు. ఆడియో విడుదలకు ముందే పాటలు లీక్ కావడం, షూటింగ్ లో ఉండగానే విజువల్స్ బయటకు వచ్చేయడం సాధారణ వ్యవహారాలుగా మారుతున్నాయి. తాజాగా బాలకృష్ణ సినిమా 'మిత్రుడు'కు కూడా ఈ లీకేజీ బెడద తప్పలేదు. శివలెంక ప్రసాద్ నిర్మాతగా రాజమౌళి శిష్యుడు మహేదేవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం మణిశర్మ సారథ్యంలో రూపుదిద్దుకున్న 'గోపాల బాల బాలకృష్ణా అంటూ వాయించెయినా మురళిని..' అనే పాట ఇప్పుడు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతోంది. బాలకృష్ణ, కథానాయిక ప్రియమణిపై ఈ పాటను సినిమాలో చిత్రీకరించారు.
ఆడియో విడుదలకు ముందే పాట లీక్ అయిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 'శివాజీ', 'జల్సా' చిత్రాలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. రామ్ చరణ్ 'మగధీర'కూ తప్పలేదు. రజనీకాంత్ -శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'రోబో' చిత్రం షూటింగ్ స్టిల్స్ సైతం ఇటీవల ఇంటర్నెట్ కు లీకై ఈమధ్యనే సంచలనం సృష్టించింది. పాటలు లీక్ కావడం తెలుగులో ఇటీవల తరచు చోటుకుంటున్నా బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి అనుభవం చవిచూడటం ఇదే ప్రథమం. ఈ విషయాన్ని బాలకృష్ణ సీరియస్ గానే తీసుకున్నారని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|