బేబి షామిలి గుర్తుంది కదా. మణిరత్నం 'అంజలి'లో మెదడు ఎదగని పాపగా చిరుప్రాయంలోనే నటించి మెప్పించిన బాలనటి. ఆ తర్వాత 'జగదేకవీరుడు అతిలోక సుందరి' వంటి ఎన్నో చిత్రాలలో బేబి షామిలి నమించింది. షామిలి అక్క షాలిని కూడా బాలనటిగానే పరిచయమై ఆమధ్య హీరోయిన్ గా ప్రమోట్ అయిన తర్వాత నటుడు తమిళ నటుడు అజిత్ ను పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడింది. ఇప్పుడు షామిలి కూడా హీరోయిన్ కు కావాల్సిన అన్ని లక్షణాలు పుణికి పుచ్చుకుని తెరంగ్రేటం చేస్తోంది. కొద్ది కాలం క్రితమే షామిలికి తమిళంలో పలు ఆఫర్లు వచ్చినప్పటికీ అప్పటికి ఆమె సిద్ధం కాలేదు. ఎట్టేకలకు షామిలి హీరోయిన్ గా తొలి సినిమా తెలుగులో చేస్తోంది. యువ కథానాయకుడు సిద్దార్ధకు జోడిగా ఆమె ప్రస్తుతం నటిస్తోంది. యూనివర్శిల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆనంద్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం 40 శాతానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా షామిలి మలయాళంలోనూ ఓ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడుగా పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న 'షికార్' చిత్రంలో షామిలి నటించనుంది. ఇందులో మోహన్ లాల్ కుమార్తెగా షామిలీ నటించబోతోంది. ఆరంభంలోనే రెండు భాషా చిత్రాల్లో కమిట్ అయిన షామిలి త్వరలోనే తమిళ ఆఫర్లు కూడా దక్కించుకోవచ్చు. తొలి సినిమా హిట్టయితే ఇవాల్టి యువతరం హీరోయిన్లకు షామిలి గట్టిపోటీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.