'పర్సంటేజీ'తప్పదుః పోసాని
సినిమా థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, కేవలం చిన్న నిర్మాతల కోసమే కాకుండా అందిరి నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని దీనిని అమలు పరచాలని నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని నిర్మాతల మండలి హాలులో బుధవారంనాడు సమావేశం నిర్వహించారు. నిర్మాత నట్టికుమార్, సంగిశెట్టి దశరథ, ఆర్.కె., సుదర్శనరావు, సాయివెంకట్ తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
తెలుగు పరిశ్రమలో ఐక్యత కొరవడిందనీ, ఏదైనా సమస్య వస్తే అందరూ కూర్చుని పరిష్కరించుకోవాలనీ, ఇక్కడ అది లేకుండాపోతోందని పోసాని ధ్వజమెత్తారు. థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు విషయంలో పరిశ్రమకు చెందిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అందరూ కలిసి చర్చించుకుంటే పరిష్కారం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. డాక్టర్ దాసరి, రామానాయుడు వంటి ప్రముఖులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలనీ, తన వంతుగా ఏది చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ ఆయన స్పష్టం చేశారు. నిర్మాతల మండలిపైన కూడా పోసాని చురుకలు వేశారు. 'సినిమా ట్రైలర్స్ ను ఉచితంగా ప్రదర్శించని టీవీ ఛానెల్స్ పై నిషేధాజ్ఞలు అంటున్నారు. ఉచితంగా పబ్లిసిటీ రావడం సినిమా వాళ్లమైన మాకు ఎంతో అవసరం. ఇదే సమయంలో కోట్లాది రూపాయలు తీసుకునే హీరోలు, దర్శకులపై నిర్మాతల మండలి ఎందుకు నిబంధంనలు విధించడం లేదు?' అని ప్రశ్నించారు. నట్టికుమార్ మాట్లాడుతూ, థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు పరుస్తామని ఫిలిం చాంబర్ ఇచ్చిన హామీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ఇందుకోసం తాము రిలే నిరాహార దీక్షలు చేపట్టి నిర్మాతల మండలి, ఛాంబర్ ఇచ్చిన హామీ మేరకు ఆ దీక్షలు విరమించుకున్నామన్నారు. పర్సంటేజీ విధానానికి నిర్మాతల మండలి మద్దతు తెలిపినప్పటికీ, ఛాంబర్ చొరవ తీసుకోవడం లేదన్నారు. ఈనెల 27లోగా పర్సంటేజీ విధానం అమలు చేయకుంటే తదుపరి పరిణామాలకు ఛాంబర్ బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
|