నిర్లక్ష్యం విలువ 'పసివాడి ప్రాణం'
వైద్యో నారాయణో హరిః అంటారు. వైద్యుడికి అంతటి ప్రాధాన్యం ఉంది. వైద్యరంగంలోనూ కొందరు స్వార్థపరులు లేకపోలేదు. ఒక డాక్టర్ నిర్లక్షం విలువ పసివాడి ప్రాణమని తెలియజెప్పే ఇతివృత్తంతో 'పసివాడి ప్రాణం' చిత్రం రూపొందుతోంది. రాజీవ్ కనకాల, అంకిత, శివాజీరాజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరఫరా ఫిలిమ్ క్రాఫ్ట్స్ పతాకంపై పి.ఉదయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
ఈ చిత్రానికి కథ హీరో అయితే దర్శకుడు మరో హీరో అనీ, శివాజీరాజా పాత్రకు అవార్డు వస్తుందనీ నిర్మాతల్లో ఒకరైన కళారవీంద్ర ఫణిరాజ్ తెలిపారు. ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చిందనీ, సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా లభించాయనీ అన్నారు. మార్చిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. డాక్టర్లు వృత్తిపరంగా మానవతా దృక్పథంతో వ్యవహరించలనే సందేశం ఇందులో ఉందనీ, కుటుంబ సమేతకంగా చూడదగ్గ చిత్రమనీ దర్శకుడు తెలిపారు. 'సముద్రం', 'ఖడ్గం' తరహాలో ఇందులో సీరియస్ పాత్రను పోషించినట్టు శివాజీరాజా తెలిపారు. ఇందులో విభిన్నమైన పాత్రను పోషించినట్టు అశోక్ కుమార్ చెప్పారు. రీరికార్డింగ్ కు మంచి ప్రాధాన్యం ఉన్న చిత్రమిదనీ, ఇందుకోసం నెలరోజుల సమయాన్ని వెచ్చించాననీ సంగీత దర్శకుడు అర్జున్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అభినయశ్రీ, మేల్కొటి, సుమనశ్రీ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|