'మరోచరిత్ర'కు శ్రీకారం
వరుణ్ సందేశ్, అనిత జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'మరోచరిత్ర' చిత్రానికి శ్రీకారం చుట్టారు. మాటినీ ఎంటర్ టైన్ మెంట్ అనే నూతన నిర్మాణ సంస్థను దిల్ రాజు స్థాపించి ఆ సంస్థ తొలిచిత్రంగా దీనిని రూపొందించనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవియాదవ్ ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచచయమవుతున్నారు. హైద్రాబాద్ లోని దిల్ రాజు కార్యాలయంలో గురువారం ఉదయం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.. ముఫ్పై ఏళ్ల క్రితం కె.బాలచందర్ తీసిన సెన్సేషన్ హిట్ 'మరోచరిత్ర' కు రీమేక్ గా ఈ చిత్రం ఉండబోతోంది.
క్లాసిక్ 'మరో చరిత్ర'కు రీమేక్ గా మాటినీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ తొలిచిత్రంగా ఈ సినిమాను రూపొందించనున్నామని దిల్ రాజు తెలిపారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన రవి యాదవ్ ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. మంచి విజువల్ సెన్స్ ఉన్న రవియాదవ్ ఈ చిత్రాన్ని దృశ్యకావ్యంగా మలచనున్నట్టు తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం బాలచందర్ తీసిన మరోచరిత్ర చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందనీ, అదే మూలకథను తీసుకుని మరికొతం కొత్త అంశాలను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించున్నారని అన్నారు. ఈ చిత్రం రీమేక్ కు బాలచందర్ నుంచి అనుమతి తీసుకున్నామనీ, జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నామనీ చెప్పారు. 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' చిత్రాల తర్వాత మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారనీ, నాలుగు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందన్నారు. యుఎస్ఎ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందనీ, ఏప్రిల్ లో అమెరికాలో షూటింగ్ జరుపుతామనీ, హైద్రాబాద్, వైజాగ్ లలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశామనీ అన్నారు. బాలచందర్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ పనిచేసిన 'మరోచరిత్ర'ను ఇప్పుడు తాను చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాననీ, 'రేస్' సినిమాలో అద్భుతమైన ఫోటోగ్రఫీ పనితనం చూపిన రవియాదవ్ దర్శకత్వంలో పనిచేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో పెరిగిన తనకు అక్కడే సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ జరగనుండటం కొత్త అనుభూతినివ్వనుందన్నారు. హీరోయిన్ గా తనకు ఇది తొలిచిత్రమనీ, యుఎస్ఎ నుంచి వచ్చిన తాను అక్కడే ఎక్కువ భాగం షూటింగ్ జరుగనున్న చిత్రంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందనీ అనిత పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో యామి గౌతమ్, ప్రతాప్ పోతన్, కోట శ్రీనివాసరావు, ఊర్వశి, నరేష్, తలైవాసల్ విజయ్, సంధ్యా జనక్, ఆదర్శ్ తదితరులు నటించనున్నారు.
Be first to comment on this News / Article!
|