తొలిచిత్రం 'ఆవకాయ్ బిర్యానీ'తో యువతరం ప్రేక్షకులను అలరించిన తెలుగుమ్మాయి బిందు మాధవి ఇప్పుడు నటిగా కూడా బిజీ అవుతోంది. మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చిన బిందు మాధవి తన రెండో చిత్రాన్ని కూడా మంచి బ్యానర్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల పూరీ జగన్నాథ్ తన సోదరుడు సాయిరాం శంకర్ తో తలబెట్టిన 'మీనాచ్చి' సినిమాలో కథానాయికగా ఆమెను అనుకున్నారు. అయితే ఇంకా ఆ చిత్రం కార్యరూపంలోకి రాలేదు. మహిళా దర్శకురాలు జయ డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి.రామానాయుడు నిర్మించనున్న చిత్రానికి బిందు మాధవి పేరు పరిశీలనలో ఉంది. అల్లరి నరేష్ హీరోగా ఈ చిత్రం ఉండబోతోంది. ఆసక్తికరంగా ఇప్పుడు ఓ 'టాక్ షో' హోస్ట్ గా కూడా బిందు మాధవి వ్యవహరించబోతున్నారు. సాక్షి టీవీలో ఈ టాక్ షో ప్రసారం కానుంది.
'సాక్షి' దినపత్రిక నుంచి ఇప్పుడు సాక్షి ఛానెల్ ప్రసారాలు మొదలుకానున్నాయి. ఇందులో 'దిల్ సే' అనే కార్యక్రానికి హోస్ట్ గా బిందుమాధవి వ్యవహరించబోతోంది. తొలి అతిథిగా నాగార్జున పాల్గొంటారనీ, ఈ కార్యక్రమంలో ఈనెల 23న ప్రసారమవుతుందని ఆ ఛానెల్ వర్గాల ద్వారా తెలిసింది. ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ టాక్ షో ప్రసారమవుతుంది.