'మెంటల్ కృష్ణ' 50 రోజులు
పోసాని కృష్ణమురళి నట దర్శకత్వంలో మోహన్ మీడియో క్రియేషన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల నిర్మించిన 'మెంటల్ కృష్ణ' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం రాత్రి హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర అర్ధశతదినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు.
మెంటల్ కృష్ణ పాత్రలో పోసాని అద్భుతంగా నటించారనీ, అలాంటి శాడిస్టు పాత్రను ఇంకెవరు పోషించినా దానికి న్యాయం చేయగలిగేవారు కాదనీ నారాయణమూర్తి ప్రశంసించారు. ఆ పాత్రను తాను చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యేదనీ, పోసాని నటించడం వల్లనే ఈ చిత్రం విజయం సాధించిందనీ అన్నారు. ఒక సక్సెస్ తరువాత మరో ఫెయిల్యూర్ చూస్తున్న పోసాని ఇకనుంచీ అన్నీ విజయాలనే సాధించాలని అభిలషించారు. సత్యకృష్ణన్ కూడా తన పాత్రలో చక్కటి ప్రతిభ కనబరచారని అన్నారు. మరో అతిథిగా పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, సామాజిక స్పృహతో సినిమాలు తీస్తున్న పోసానిని అభినందించాలని అన్నారు. ఈ చిత్రంలో ఆయన శాడిస్టు పాత్ర పరాకాష్టకు చేరిందనీ, అయితే కొంత మోతాదు తగ్గి ఉంటే బాగుండేదని ఒక అన్నగా తన అభిప్రాయమనీ చెప్పారు. సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, తాను తీసిన 'పవిత్ర బంధం' నుంచి పోసాని కాంబినేషనలో పలు చిత్రాలు వచ్చాయనీ, పోసాని రచయితగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ, ఇతరులకు సాయపడే మంచి మనిషనీ అన్నారు. మునుముందు ఆయన మరిన్ని మంచి చిత్రాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని సూచించారు. ఇదే డయాస్ నుంచి పోసాని కృష్ణమురళి తొమ్మిది మంది చిన్నారుల గుండె ఆపరేషన్ నిమిత్తం 7 లక్షల రూపాయల సహాయాన్ని డాక్టర్ గోపీచంద్ కు అందజేశారు. అనంతరం అతిథులు చేతుల మీదుగా 50 రోజుల షీల్డుల ప్రదానం జరిగింది. కోట శ్రీనివాసరావు, గిరిబాబు, శివాజీరాజా, నిర్మాత నట్టికుమార్, నూతన హీరోయిన్ గెహనా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|