కొత్తకోణంలో షిర్డీ సాయిబాబా
షిర్డీ సాయిబాబా చిత్రాల్లోనే కొత్తకోణంలో 'జగద్దురు శ్రీ షిర్డీ సాయిబాబా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఆ చిత్ర దర్శకుడు జి.రామకృష్ణ తెలిపారు. ఎస్.ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. షిర్డీ సాయిబాబాగా నటిస్తున్న బి.వి.రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత కూడా. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని ఓ బంగ్లాలో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతోంది. గురువారంనాడు సెట్స్ లోనే ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
సాయిబాబా దైవస్వరూపుడే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త అనీ, మత సామరస్యాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తి అనీ బివి రెడ్డి తెలిపారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్, మెహర్ బాబా వంటి ప్రముఖులు బాబా ఆశీస్సులు ఎలా అందుకున్నారనే అంశాలను కూడా ఇందులో చూపించనున్నామని చెప్పారు. నాగబాబు, బ్రహ్మాజీ, శివకృష్ణ వంటి నటులు తమ పాత్రల్లో లీనమై నటిస్తున్నారని తెలిపారు. ఇంతవరకూ 3 పాటలు, కొంత టాకీ పూర్తి చేసినట్టు దర్శకుడు రామకృష్ణ తెలిపారు.శనివారం వరకూ ఇక్కడే షూటింగ్ జరిపి శివరాత్రి తర్వాత అవుట్ డోర్ షూటింగ్ జరుపుతామని చెప్పారు. ఇందులో తాత్యా పాత్రను పోషిస్తున్నట్టు సత్యారెడ్డి తెలిపారు. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి ఆధునిక పరిజ్ఞానం ఇందులో జోడిస్తున్నామని ఛాయాగ్రాహకుడు కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నారాయణరావు, రఘునాధరడ్డి, రామిరెడ్డి, కోట శంకరరావు, గుండు హనుమంతరావు, హేమసుందర్, శివపార్వతి, రమాప్రభ తదితరులు నటిస్తున్నారు. కొమ్మనాపల్లి గణపతిరావు మాటలు, లలిత్ సురేష్ సంగీతం అందిస్తున్నారు
Be first to comment on this News / Article!
|