విష్ణు వివాహం మార్చి 1న
మంచు వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. డాక్టర్ ఎం.మోహన్ బాబు తనయుడుగా పరిశ్రమలోకి అడుగుపెట్టి 'ఢీ' చిత్రంతో సక్సెస్ ఫుల్ హీరోగా పరిశ్రమలో నిలదొక్కుకున్న విష్ణువర్దన్ బాబు, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తె విరానికాల వివాహం పెద్దల అంగీకారంతో మార్చి 1న హైద్రాబాద్ లో అత్యంత వైభవంగా జరుగనుంది. గచ్చిబౌలీ స్టేడియంలో మూడు రోజుల పాటు కనీవినీ ఎరుగని రీతిలో ఈ వివాహ సంబరాలు జరుగనున్నాయి.
విష్ణువర్దన్, విరానికాలు ప్రేమించుకోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను ఆశీర్వదించి ఇటీవల ఎంగేజ్ మెంట్ జరిపారు. విరానికాను తొలి చూపులోనే ప్రేమించాననీ, ఆమెను చూడగానే చుట్టూ లోకమంతా స్తంభించినట్టు అనిపించిందనీ, ఆమె తనకోసమే పుట్టినట్టు అనిపించిందనీ విష్ణు ఇటీవలే తమ ప్రేమకథను చెప్పుకొచ్చారు. పదిరోజుల పరిచయం తర్వాత ఇద్దరి భావాలూ ఒకటేనని గ్రహించి
ఒకరిపై మరొకరు ఆరాధన పెంచుకున్నామనీ చెప్పారు. విరానికలో సినీ నటుడ్ని చేసుకోవాలనే ఆలోచన లేదనీ, అయితే ఆమె మనసుకు నచ్చే లక్షణాలన్నీ తనలో కనిపించడంతో తనను కూడా అంతే గాఢంగా ప్రేమించిందనీ అన్నారు. పెద్దల సమ్మతం లేనిదే పెళ్లి చేసుకోరాదని ఇద్దరూ అనుకున్నామనీ, అందుకు తగ్గట్టే ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు పెట్టుకండానే తమ ప్రేమను పెద్దలు ఆశీర్వదించి పెళ్లికి సమ్మతించడం సంతోషంగా ఉందనీ చెప్పారు. విష్ణు-విరానికాల వివాహానికి పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులంతా విచ్చేయనున్నారు.
Be first to comment on this News / Article!
|