'జల్లు' పాటలు
జయంత్ హీరోగా రేచర్ల మూవీ క్రియేషన్స్ పతాకంపై రేచర్ల సుభాష్ నాయుడు నిర్మించిన చిత్రం 'జల్లు'. వి.వి.నారాయణ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఆడియో క్యాసెట్ ను విడుదల చేసి తొలి క్యాసెట్ ను మరో అతిథిగా పాల్గొన్న కరుణాకరన్ కు అందజేశారు. ఆడియో సీడీని కరుణాకరన్ ఆవిష్కరించి కె.ఎస్.రామారావుకు అందించారు. నీహల్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, తాను నిర్మించిన 'వాసు' చిత్రానికి దర్శకత్వ శాఖలో నారాయణ పనిచేశాడనీ, ఈ చిత్రం ఆడియో ఏ సంస్థ నుంచి విడుదల చేయాలని అడిగినప్పుడు ఆదిత్య మ్యూజిక్ వారిని కలవమని చెప్పాననీ అన్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా విజయవంతం కావాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కష్టించి పనిచేసే నారాయణకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇవ్వాలని కరుణాకరన్ అభిలషించారు. కె.ఎస్.రామారావు, కరుణాకరన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం, వారి చేతుల మీదుగా ఇప్పుడు ఆడియో విడుదల కావడం సంతోషంగా ఉందని దర్శకుడు నారాయణ పేర్కొన్నారు. ఈ చిత్ర కథ వినగానే నిర్మాత సినిమా చేయడానికి ముందుకు వచ్చారనీ, మంచి సంగీతం కోసం నీహాల్ ను బాగా కష్టపెట్టాననీ, ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. నీహాల్ మాట్లాడుతూ, 'రెయిన్ బో' తర్వాత తనకు ఈ చిత్రం పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నట్టు నీహాల్ పేర్కొన్నారు. తాను పరిశ్రమకు కొత్త కావడంతో కొందరు భయపెట్టారనీ, అయితే పరిశ్రమ తనకు బాగా నచ్చిందనీ, దర్శకుడితో పాటు యూనిట్ అంతా కష్టపడి చక్కగా ఈ సినిమాను రూపొందించారనీ నిర్మాత సుభాష్ నాయుడు తెలిపారు. తాను వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని హీరో జయంత్ తెలిపారు.విదేశాల్లో పనిచేస్తున్న తాను ఈ సినిమా పూర్తి చేయడానికి మూడు సార్లు ఇండియాకు వచ్చాననీ చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. వేణు, రావు రమేష్, ప్రేరణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|