'సొంత ఊరు' ఆడియో
రాజా కథానాయకుడుగా సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై వై.రవీంద్రబాబు, కిషోరి బసిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సొంత ఊరు'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. లగడపాటి శ్రీధర్, చంద్రమహేష్, రాజా, ఎల్బీ శ్రీరాం, సంగీత దర్శకుడు సాకేత్ సాయిరాం, బసిరెడ్డి, రవీంద్రబాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఆడియో సీడీని లగడపాటి శ్రీధర్ ఆవిష్కరించి చంద్రసిద్దార్ధకు అందజేశారు.
లగటి శ్రీధర్ మాట్లాడుతూ, మంచి అభిరుచితో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, సినిమా చక్కటి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. చంద్రసిద్దార్ధ మాట్లాడుతూ, ఇప్పుడు హౌస్ ఫుల్ అనే చిత్రాన్ని తాను నిర్మిస్తున్నాననీ, 'సొంత ఊరు' చిత్రం విడుదలవుతున్న అన్ని థియేటర్లలోనూ హౌస్ ఫుల్ బోర్డులు చూడాలని కోరుకుంటున్నాననీ అన్నారు. మంచి ఆవకాయ ఎలాగో, మంచి సినిమా కూడా అంతేననీ, అన్నీ కుదిరితేనా రుచి బాగుంటుందని ఎల్బీ శ్రీరాం అన్నారు. ఈ చిత్రానికి అన్నీ సమపాళ్లలో కుదిరాయని అన్నారు. మంచి కథను తాను ఇష్టపడుతుంటాననీ, అలాంటి కథను దర్శకుడు తయారు చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారనీ హీరో రాజా తెలిపారు. తన కెరీర్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాతలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|