ఏ పాత్రకైనా రెడీః కోటప్రసాద్
నటన వారసత్వం కాకపోయినా పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి వారసత్వం అనేది ఓ అడ్వాంటేజ్ అవుతుంటుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు కోట ప్రసాద్ ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ 'సిద్ధం' చిత్రంలో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. జె.డి.దర్శకత్వంలో జగపతిబాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయన అసిస్టెంట్ గా ఓ కీలక పాత్రలో కోట ప్రసాద్ నటించారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అయిన జగపతిబాబుతో పోటీపడుతూ అడ్డదారిలో వెళ్లయినా తాను ఆయనను మించిపోవాలని (ఎన్ కౌంటర్లు చేయడంలో) తపనపడే విలనీ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రసాద్ నటన ప్రేక్షకుల గుర్తింపు పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను మీడియాకు కోట శ్రీనివాసరావు ఆదివారంనాడు పరిచయం చేశారు.
'సిద్ధం' చిత్రంతో తన కుమారుడు కోట ప్రసాద్ శుభారంభం పలకడం, అతని నటనకు ప్రశంసలు లభిస్తుండం ఒక తండ్రిగా చాలా సంతోషంగా ఉందని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. కోట ప్రసాద్ మాట్లాడుతూ, తన తండ్రే తనకు స్ఫూర్తి అనీ, ఎలాంటి పాత్రలైనా పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ అన్నారు. జగపతిబాబు, జె.డి.చక్రవర్తి తనకు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు. సినిమాల్లోకి రాకముందు ఎంబిఎ పూర్తి చేసి బిజినెస్ చేశానని చెప్పారు. 'సిద్ధం' చిత్రంతో తనకు మంచి శుభారంభం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. కోట ప్రసాద్ తొలిసినిమాతోనే మంచి నటుడిగా నిరూపించుకుని చక్కటి పునాది వేసుకున్నారని దర్శకుడు శ్రీనువైట్లు ఈ సందర్భంగా అభినందించారు.
Be first to comment on this News / Article!
|