అంతా గర్వించాలిః కోటి
'స్లమ్ డాగ్ మిలయనీర్ ' చిత్రానికి గాను రెండు (ఉత్తమ సంగీతం, ఉత్తమ గాయకుడు) ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులు గెలుపొందిన తొలి భారతీయుడుగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన విఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కు దేశవ్యప్తంగా ప్రంశసలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువురు సంగీత దర్శకులతో పాటు దర్శకనిర్మాతలు సైతం
భారతీయదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడుగా ఆయనను అభివర్ణించారు. రెహ్మాన్ ఆస్కార్ అవార్డులు పొందడం భారతీయులమైన మనందరికీ, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వ్యాఖ్యానించారు. ఆయన అసామాన్యమైన విజయం సాధించారనీ, ఇది ఒక గొప్ప అఛీవ్ మెంట్ అనీ అన్నారు. గతంలో రాజ్, తాను కలిసి సంగీత దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు రెహ్మాన్ కీ-బోర్డు ప్లేయర్ గా పనిచేశారనీ, తమ సంగీత ద్వయం వద్ద 8 ఏళ్ల పాటు కీబోర్డు బ్లోయర్ గా ఉన్నారనీ చెప్పారు.తమ వద్దే కాకుండా చాలామంది సంగీత దర్శకుల వద్ద కూడా రెహ్మాన్ పనిచేశారనీ, క్రమశిక్షణతో మెలిగే అతనికున్న ప్రతిభాపాటవాలు అద్భుతమనీ, మీడియా కూడా ఆయనను ఎంతో ప్రోత్సహించిందనీ రెహ్మాన్ అన్నారు.
రెహ్మాన్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి
అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులు పొందడం వెనుక రెహ్మాన్ కృషి అద్భుతమని ప్రముఖ నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అభివర్ణించారు. రెహ్మాన్ కెరీర్ ప్రారంభంలో తాను తీసిన ఓ సినిమాకి కూడా కీబోర్డు ప్లేయర్ గా పనిచేశారనీ, నిజానికి ఈ సందర్భంలో చెప్పడం అని కాదు కానీ, అతను ఆ స్థాయి నుంచి ఆస్కార్ అందుకోవడం వరకూ ఎంత పట్టుదలతో తపించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చనీ ప్రశంసించారు. రెహ్మాన్ ను స్ఫూర్తిగా తీసుకుంటే భారత చలన చిత్ర పరిశ్రమ మునుముందు ఎన్నో ఆస్కార్ అవార్డులను దక్కించుకునే అవకాశం ఉంటుందన్నారు. అందరికీ ప్రేమపాత్రుడైన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ అనీ, ఆయనకు రెండు ఆస్కార్ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందనీ తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా రెండు ఆస్కార్ లతో పాటు ఆయన పనిచేసిన 'స్లమ్ డాగ్ మిలయనీర్ ' చిత్రానికి 8 ఆస్కార్లు రావడం భారతీయులంతా గర్వించాల్సిన విషయమని అన్నారు. ఎంతో మంది కళాకారులకు ఇది ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
Be first to comment on this News / Article!
|