తెలుగులో విక్రమ్ గోఖలే
ప్రముఖ హిందీ నటుడు, మరాఠీ రంగస్థల నటుడు విక్రమ్ గోఖలే తొలిసారి తెలుగులో నటిస్తున్నారు. కె.సతీష్ ('హోప్ ' ఫేమ్) దర్శకత్వంలో మోహన్ వడ్లపట్ల నిర్మిస్తున్న 'కలవరమాయె మదిలో' చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కలర్స్ స్వాతి, కమల్ కామరాజ్ ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్ ) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. బుధవారంనాడు సెట్స్ లోనే చిత్రయూనిట్ ఆ వివరాలు తెలియజేసింది.
విక్రమ్ గోఖలే 'ఉదాన్ ' టీవీ సీరియల్ లో నటించిన రోజుల్లోనే ఆయనకు తాను వీరాభిమానిననీ, ఈ చిత్రంలో ఆయన నటిస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ దర్శకుడు సతీష్ తెలిపారు. తనికెళ్ల భరణి కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. హీరోహీరోయిన్లు కూడా చక్కటి నటన ప్రదర్శిస్తున్నారనీ, ఇంవవరకూ జరిగిన షెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ పూర్తయిందనీ చెప్పారు. ఈ చిత్రంలో తనకు అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు తాను రుణపడి ఉంటానని విక్రమ్ గోఖలే అన్నారు. తాను ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాననీ, షూటింగ్ కు ఒకరోజు ముందే సంభాషణలు కంఠోపాఠంగా నేర్చుకున్నాననీ అన్నారు. సతీష్ ప్రతిభావంతుడైన దర్శకుడని, తెలుగు పరిశ్రమలోని క్రమశిక్షణ, టైమ్ సెన్స్ తననెంతో ఆకట్టుకున్నాయనీ ప్రశంసించారు. రంగస్థల నేపథ్యం నుంచి వచ్చిన గొప్ప కళాకరుడు గోఖలే అని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య కొన్ని చక్కటి సన్నివేశాలున్నాయనీ చెప్పారు. కమల్ కామరాజు మాట్లాడుతూ, విక్రమ్ సార్ కూ తనకూ మధ్య ఎక్కువ సన్నివేశాలు లేనప్పటికీ ఆయనను కలుసుకుని ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నానని హీరో కమల్ కామరాజు తెలిపారు.
Be first to comment on this News / Article!
|