15న శ్రీదేవి నిశ్చితార్ధం
వర్దమాన నటి శ్రీదేవి త్వరలో పెళ్లి పీటల మీద కూర్చోనుంది. మంజుల, విజయ్ కుమార్ దంపతుల చిన్న కుమార్తె అయిన శ్రీదేవి పెద్దలు కుదుర్చిన వరుడినే పెళ్లాడనుంది. వరుడు రాహుల్ హైద్రాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ అధిపతిగా ఉన్నారు. ఈనెల 15న శ్రీదేవి నిశ్చితార్ధానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 18న వివాహానికి ముహూర్తం కూడా నిశ్చయమైంది.
తెలుగు, తమిళ భాషల్లో శ్రీదేవి పలు చిత్రాల్లో నటించింది. 'రుక్ష్మిణి' చిత్రంలో బాలనటిగా తెలుగు పరిశ్రమలోకి ఆమె అడుగుపెట్టింది. అనంతరం ప్రభాస్ సరసన 'ఈశ్వర్' చిత్రంలో తొలిసారి కథానాయికగా నటించింది. ఆ తర్వాత 'పెళ్లికాని ప్రసాద్', 'ఆదిలక్ష్మీ', 'మంజీర' వంటి పలు చిత్రాల్లో శ్రీదేవి నటించింది. అయితే సక్సెస్ అనేది ఆమెతో ఎప్పటికప్పుడు దాగుడుమూతలు ఆడుతూనే వచ్చింది. తల్లిదండ్రులు ఎంతో క్రమశిక్షణతో పెంచడం వల్ల నటిగానూ ఆమె ఎంతో క్రమశిక్షణ పాటిస్తూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ వచ్చారు. కెరీర్ లో ఎలాంటి వివాదాలు లేని నటిగా ఆమెకు మంచి పేరుంది. వివాహ నిశ్చితార్ధానికి మరి కొద్ది రోజులే వ్యవధి ఉండటంతో షాపింగ్ లో శ్రీదేవి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. వివాహానంతరం శ్రీదేవి నటనను కొనసాగిస్తుందా అనేది ఇంకా తెలియవలసి ఉంది.
Be first to comment on this News / Article!
|