అల్లు అర్జున్ కొత్త చిత్రం 21న
అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న యువహీరోల్లో అల్లు అర్జున్ ఎప్పడికప్పుడు తన ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు. 'గంగోత్రి', 'ఆర్య', 'బన్నీ', 'దేశముదురు', 'పరుగు' వంటి వరుస సక్సెస్ లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన నటించిన 'హ్యాపీ' చిత్రం మాత్రం బాక్సాఫీస్ పరంగా నిరాశపరచింది. ప్రస్తుతం 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా ఆయన నటిస్తున్న 'ఆర్య-2' చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. తొలి వెర్షన్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ డైరెక్షన్ లోనే ఈ చిత్రం రూపుదిద్దుకోవడం కూడా మంచి అంచనాలకు తావిస్తోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మేలో సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి కూడా తాజాగా ముహూర్తం నిశ్చయమైంది. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న ఈ కొత్త చిత్రం ఈనెల 21న సెట్స్ పైకి రానుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేశారు. గుణశేఖర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తుండటం ఇదే ప్రథమం.
'చూడాలని ఉంది', 'ఒక్కడు', 'అర్జున్' వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మహేష్ తో ఆయన తీసిన 'సైనికుడు' చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూడటంతో కొద్ది కాలం గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ఇప్పుడు రెట్టించిన పట్టుదలతో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి అద్భుతమైన స్క్రిప్టు రెడీ చేశారని తెలుస్తోంది. హీరోయిన్, నటీనటుల ఎంపిక ఇంకా ఫైనలైజ్ కావలసి ఉంది. అయితే కొత్త హీరోయిన్ ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నట్టు తెలిసింది. యూనివర్శల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|