సమ్మర్ లో పోటాపోటీ రిలీజ్ లు
సంక్రాంతి తర్వాత వచ్చే భారీ సీనస్ సమ్మర్. విద్యార్థులకు పరీక్షలు పూర్తయి సెలవలు వస్తాయి. దీంతో నిర్మాతలు సహజంగానే సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసుకుంటారు. ఈసారి సైతం ఏప్రిల్, మే నెలల్లో పలు భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల చిత్రాలు వరుస రిలీజ్ లతో సందడి చేయబోతున్నాయి. ప్రభాస్ 'బిల్లా' చిత్రంతో పెద్ద చిత్రాల పోటీ మొదలుకానుంది. నిజానికి ఆయా చిత్రాల విడుదల తేదీలు ఇంకా నిశ్చయం కానప్పటికీ దర్శకనిర్మాతలు పక్కా డేట్ ప్లానింగ్ తో శరవేగంగా తమ చిత్రాల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడుగా మెహర్ రమేష్ ('కంత్రీ' ఫేమ్ ) దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ చిత్రంగా 'బిల్లా' రూపొందుతోంది. అనుష్క, నమిత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించనుంది. కృష్ణంరాజు ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇదే నెల 27న రిలీజ్ చేయాలనే ప్లాన్ లో దర్శకనిర్మాతలు ఉన్నారు.
ఏప్రిల్ లో యువరత్న బాలకృష్ణ 'మిత్రుడు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రియమణి కథానాయికగా మహాదేవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'కిక్' చిత్రం సైతం ఇంచుమించు ఇదే సమయంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల రెండో వారంలో ఆడియో విడుదల చేసి ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో సినిమా విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్, కాజల్ జంటగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న 'మగధీర' చిత్రం మేలో విడుదలకు సిద్ధమవుతుంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్య-2', నాగచైతన్యను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న 'జోష్' చిత్రాలు కూడా జూలై నెలను టార్కెట్ చేసుకున్నాయి. ఎన్టీఆర్-వినాయక్ ల 'అదుర్స్', సిద్దార్ధ 'ఓయ్', సుమంత్ 'బోణి' చిత్రాలు సైతం సమ్మర్ టార్గెట్ గా విడుదలకు ముస్తాబవుతున్నాయి.
Be first to comment on this News / Article!
|