ఫైట్స్ చేస్తున్న 'మగధీర'
రామ్ చరణ్ తేజ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'మగధీర' చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకొంటోంది. సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసుకుని మేలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పీటర్ హెయిన్స్ ఈ యాక్షన్ ఎపిసోడ్లను కంపోజ్ చేస్తున్నారు. నిజానికి కొద్ది రోజులకు ముందే ఈ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉండగా పీటర్ హెయిన్స్ ఓ క్లిష్టమైన ఫైట్ కోసం రిహార్సల్స్ చేస్తూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. రామ్ చరణ్ తేజ సైతం కాలికి గాయమై కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం యూనిట్ మళ్లీ షూటింగ్ ప్రారంభించడంతో ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
పునర్జన్మల కథాంశంతో ప్రేమకథా చిత్రంగా 'మగధీర' తెరకెక్కుతోంది. రామ్ చరణ్ వయసుకు తగ్గ పాత్ర పోషిస్తూనే పలు కీలకమైన యాక్షన్ ఎపిసోడ్లలోనూ సత్తా చూపనున్నారు. ఇందుకోసం హార్స్ రైడింగ్, కరాటేలోనూ శిక్షణ తీసుకున్నారు. రామ్ చరణ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. కథానుగుణంగా చిరంజీవీ, రామ్ చరణ్ కలిసి స్పెప్పులు వేసిన 'బంగారు కోడిపెట్ట' రీమిక్స్ సాంగ్
ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా, రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎం.కీరవాణి సంగీతం అదిస్తున్నారు. త్వరలోనే సుప్రీం మ్యూజిక్ ద్వారా 5 లక్షల ఆడియో క్లాసెట్లు, సీడీలు రిలీజ్ చేసి, మేలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమా విడుదలకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|