తనికెళ్ల భరణి 'కీ'
'సిరా' చిత్రానికి దర్శకత్వం వహించి పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తన ద్వితీయ ప్రయత్నంగా 'కీ' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నటి జయలలిత ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. నానాటికీ పెరిగిపోతున్న ఆత్మహత్యల కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారంనాడు ఈ చిత్రాన్ని పాత్రికేయులకు ప్రదర్శించారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ, ఈ ఆధునిక యుగంలోనూ ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయడం కష్టంగానే ఉందనీ, ప్రేమలో ఫెయిలయినా, పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోయినా ప్రతి దానికీ చావే పరిష్కారమనే మానసిక దౌర్భల్యం పెరిగిపోయిందని అన్నారు. నానాటికీ పెరిగిపోతున్న ఆత్మహత్యల నేపథ్యంలో ఓ సినిమా తీస్తే బాగుంటుందనిపించి 'కీ' చిత్రాన్ని రూపొందించామని అన్నారు. మన ఆత్మను మనమే ఉద్దరించుకోవాలన్న పాయింట్ ను ఇందులో ఆవిష్కరించామని చెప్పారు. అంతర్జాతీయ చిత్రోత్సవాలకు కూడా ఈ సినిమాను పంపుతామని అన్నారు. నటి జయలలిత తన అభిరుచిని చాటుకుంటూ ఈ చిత్రానికి నిర్మాత కూడా అయ్యారని తెలిపారు. 'సిరా' చిత్రం కంటే విభిన్నంగా భరణి ఈ సినిమాను మలిచినట్టు జయలలిత తెలిపారు. నిర్మాతగా కీర్తికిరీటాలు రావాలని కాకపోయినా మనసుకు తృప్తి కలగాలని తీసిన చిత్రమిదని అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన శ్రమ అంతా భరణిదేననీ, యూనిట్ అంతా బాగా సహకరించారనీ చెప్పారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన షఫీ మాట్లాడుతూ, సహజత్వానికి దగ్గరగా ఉన్న ఫాంటసీ చిత్రమిదనీ, ఒక నటుడిగా మట్టిముద్దగా ఒదిగిపోయిన తనను భరణి కావలసిన విధంగా మలుచుకున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ఈ చిత్రం కనువిప్పు కలిగిస్తుందన్నారు. సిరా చిత్రానికి 3 అవార్డులు వచ్చాయనీ, ఈ చిత్రానికి అంతకంటే ఎక్కువ అవార్డులు రావాలని మరో నటుడు భార్గవ్ మోహన్ అభిలషించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వీణాపాణి, ఛాయాగ్రాహకుడు ఆర్.పి.తనికెళ్ల, ఎడిటర్ ెస్.ఉద్దవచార్య, కళా దర్శకుడు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|