అల్లరితో ఆవకాయ్...
శేఖర్ కమ్ముల నిర్మించిన 'ఆవకాయ్ బిర్యానీ' చిత్రంతో హీరోయిన్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టిన పదహారణాల తెలుగు అమ్మాయి బిందు మాధవి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతోంది. ప్రకాష్ వి.ప్రొడక్షన్స్ పతాకంపై వి.నాగేందర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'కొంచెం కొత్తగా' అనే థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించిన రాజు రాజేంద్రప్రసాద్ ఈ తాజా చిత్రానికి దర్శకుడు. ఇందులో 'అల్లరి' రవిబాబు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ వారంలోనే ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
వాస్తవ సంఘటనలకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుందనీ, సమకాలీన పరిస్థితులే ఈ చిత్రానికి ప్రేరణ అనీ దర్శకుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. రవిబాబు ఇంతవరకూ చేయనటువంటి ధీరోదాత్త పాత్రను ఇందులో పోషించనున్నారనీ, భావోద్యాగాలగు పెద్దపీట వేసే చక్కటి పాత్రను బిందుమాధవి పోషించనుందనీ తెలిపారు. రవిబాబు ఇటీవల దర్శకుడిగా 'నచ్చావులే' వంటి సక్సెస్ ఫుల్ మూవీకి దర్శకత్వం వహించినప్పటికీ నటుడిగా తనకున్న అభిరుచితో అడపాదడపా సినిమాల్లో నటిస్తుండటం విశేషం. బిందుమాధవి సైతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన సోదరుడు సాయిరాం శంకర్ చిత్రంలో నటించనుందనీ, రామానాయుడు నిర్మాతగా బి.జయ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అల్లరి నరేష్ కు జోడిగా ఎంపికైందనీ వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రాలు ఇంకా సెట్స్ పైకి రాలేదు.
Be first to comment on this News / Article!
|