పాలిటిక్స్ చేస్తున్న కమ్ముల
శేఖర్ కమ్ములకూ, పాలిటిక్స్ కూ సంబంధం ఏమిటి అంటారా? నిజానికి లేదు. అయితే ఆయన ఈసారి తన కొత్త చిత్రానికి మాత్రం పొలిటికల్ నేపథ్యాన్ని కథాంశంగా చేసుకుంటున్నారు. మంచి కాఫీలాంటి సినిమా అంటూ 'ఆనంద్', ఈ వేసవి చల్లగా ఉంటుందంటూ 'గోదావరి', యూత్ కోసం 'హ్యాపీడేస్' అందించిన కమ్ముల కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకుంటున్నారు. డాక్టర్ డి.రామానాయుడు మనువడు, డి.సురేష్ బాబు తనయుడు అయిన రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎవిఎం సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత నెలరోజులుగా ఈ చిత్రం ప్రచారార్భాటాలకు దూరంగా షూటింగ్ జరుపుకొంటోంది. అయితే ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో ఉంటుందనే ఫీలర్ మాత్రం బయటకు వచ్చింది. ఇందులో రాణా ముఖ్యమంత్రి తనయుడుగా నటిస్తుండే, ముఖ్యమంత్రి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషిస్తున్నారు.
ఇందులో ముఖ్యమంత్రిగా తాను వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాననీ, ఇంతకు ముందు రామానాయుడు గారి సినిమాల్లోనూ, వారి అబ్బాయి వెంకటేష్ సినిమాల్లోనూ నటించాననీ, ఇప్పుడు మరో తరం వారసుడు రాణాతో కలిసి చేస్తుండటం, అందులోనూ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కావడం చాలా సంతోషంగా ఉందనీ సుమన్ తెలిపారు. ఆసక్తికరంగా ఏవియం సంస్థ రజనీకాంత్ హీరోగా నిర్మించిన హిట్ చిత్రం 'శివాజీ' లోనూ సుమన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే బ్యానర్ లో మరోసారి చేస్తుండటం సుమన్ ను సంతోషంలో ముంచెత్తుతోంది.
Be first to comment on this News / Article!
|