శర్వానంద్-చంద్రసిద్దార్ధ చిత్రం
'ఆ నలుగురు' 'మధుమాసం' వంటి హిట్ చిత్రాలకు దర్శకుడు చంద్ర సిద్దార్ధ తన ఫిల్మోత్సవ్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శ్రీకారం చుట్టారు. రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం ఉదయం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరో శర్వానంద్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి యువ కథానాయకుడు రామ్ క్లాప్ ఇవ్వగా, డాక్టర్ డి.రామానాయుడు స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు. శర్వానంద్ బర్త్ డే కూడా ఇదే రోజు కావడం విశేషం.
చంద్ర సిద్దార్ధ మాట్లాడుతూ, గ్రామం నుంచి పట్టణం వరకూ ఓ యువకుడు జరిపే జర్నీ ఈ చిత్రమని తెలిపారు. చక్కటి క్యారెక్టరైజేషన్ తో ఇందులోని పాత్రలు అందర్నీ ఆకట్టుకుంటాయని చెప్పారు. కథా రచయిత్రి బలభద్రపాత్రుని రమణి మాట్లాడుతూ, ఇది యూనివర్శల్ ప్రేమ కథ అనీ, ఇద్దరు తండ్రీ కొడుకులు ఎవరు నమ్మిన సిద్దాంతాన్ని వారు పాటిస్తూ ఉంటారనీ, మంచి ప్రేమకథాంశం కూడా ఇందులో ఉంటుందనీ చెప్పారు. శర్వానంద్ మాట్లాడుతూ, ఎన్నో పుట్టినరోజులు చేసుకున్నప్పటికీ ఈ బర్త్ డేకి ప్రత్యేకత ఉందనీ, ఇదే రోజు తన కొత్త చిత్రం చంద్రసిద్దార్ధ దర్శకత్వంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు. 'గమ్యం' తర్వాత మళ్లీ అంతటి మంచి స్క్రిప్టు ఈ చిత్రానికి లభించిందని అన్నారు సంగీతం, సాహిత్యం పట్ల మంచి అభిరుచి ఉన్న చంద్రసిద్దార్ధతో పనిచేస్తుండటం సంతోషంగా ఉందని చిత్ర సంగీత దర్శకుడు అనూప్, గీత రచయిత చైతన్య ప్రసాద్ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|