కొత్త హీరోలతో 'టులెట్'
అదన్, పవన్ లను హీరోలుగా పరిచయం చేస్తూ శ్రీ ఆంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై రామదాసు నిర్మిస్తున్న చిత్రం 'టులెట్'. రవికాంత్ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్ లో శుక్రవారం ఉదయం ఈ చిత్రం ప్రారంభమైంది. హీరోలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి డాక్టర్ డి.రామానాయుడు క్లాప్ ఇవ్వగా, చిత్ర సమర్పకుడు రాజశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నట్టు నిర్మాత రామదాసు పేర్కొన్నారు. దర్శకుడు రవికాంత్ మాట్లాడుతూ, పూర్తి కామెడీ చిత్రమిదనీ, సెంటిమెంట్ కూడా మిళితమై ఉంటుందనీ చెప్పారు. ఇద్దరు హీరోలతో పాటు ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో ఉంటారనీ, వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ చెప్పారు. కొన్ని పాటలు విదేశాల్లో చిత్రీకరించేందుకు కూడా ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో అన్నపూర్ణ, మనోరమ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి రవికాంత్ కథ-మాటలు, రవి కె నీర్ల సినిమాటోగ్రఫీ, రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|