అల్లు అర్జున్ తో కొత్తమ్మాయి
ప్లాన్డ్ గా సినిమాలు చేస్తూ సక్సెస్ ల శాతం పెంచుకుంటున్న స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ తొలిసారి భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ లో నటిస్తుండటం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈనెల 22 నుంచి ఈ కొత్త చిత్రం షూటింగ్ హైద్రబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ కు జోడిగా కొత్తమ్మాయి భానుశ్రీ తెలుగు తెరకు పరిచయమవుతోంది.
తొలి షెడ్యూల్ లో భాగంగా రెండు సాంగ్స్ చిత్రీకరణ జరుపనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు భారీ సెట్స్ వేశారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఆయన సిద్దార్ధ, షామిలి జంటగా 'ఓయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సైతం సుకుమార్ దర్శకత్వంలో 'ఆర్య-2' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే రెండో చిత్రం షూటింగ్ లో పాల్గొంటుండటం ద్వారా అల్లు అర్జున్ యువహీరోల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసుకుంటూ అగ్రహీరోలు సైతం ఏడాదికి ఒక సినిమాకే పరిమితమవుతున్న తరుణంలో అల్లు అర్జున్ పరుగు పెడుతుండటం ఆయన అభిమానులను ఉత్సాహ పరుస్తోంది. అల్లు అర్జున్ -గుణశేఖర్ కాంబినేషన్ చిత్రాన్ని మూడు షెడ్యూల్స్ లో ఆగస్టు నాటికి పూర్తి చేయాలనే పట్టుదలతో నిర్మాత దానయ్య ఉన్నారు. ఈ చిత్రానికి 'గజనీ' ఫేమ్ ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|