స్టార్ క్రికెట్ విజేత కోలీవుడ్
చెన్నైః తెలుగు, తమిళ సినీనటుల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో శనివారం ఆద్యంత అహ్లాదభరితంగా, స్నేహపూరిత వాతావరణంలో జరిగిన 'సినీస్టార్స్' క్రికెట్ మ్యాచ్ లో కోలీవుడ్ కు చెందిన 'చెన్నై వారియర్స్' టీమ్ టాలీవుడ్ కు చెందిన 'ఆంధ్రా కింగ్స్' పై విజయం సాధించింది.
'ఆంధ్రా కింగ్స్' టీమ్ కు హీరో రాజశేఖర్ సారథ్యం వహించగా, సాయికుమార్, ఉదయ్ కిరణ్, నిఖిల్, ఆర్యన్ రాజేష్, రాజీవ్ కనకాల తదితరులు జట్టు సభ్యులుగా ఉన్నారు. కోలీవుడ్ టీమ్ కు జె.కె.రితీష్ కెప్టెన్ కాగా, ఆర్య, శిలాంబరసన్, భరత్, శ్రీకాంత్, జీవా, రమణ, జితన్ రమేష్, శాంతనూ తదితరులు జట్టు సభ్యులు. 25-25 ఓవర్ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన కోలీవుడ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. విక్రాంత్, జితన్ రమేష్ ఓపెనర్స్ గా బరిలోకి దిగారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టాలీవుడ్ టీమ్ 187 పరుగులలకే ఆలౌట్ కావడంతో 'చెన్నై వారియర్స్' విజేతగా నిలిచింది. చెన్నైవారియర్స్ కు చెందిన ఆర్య మూడు వికెట్లు పడగొట్టి బెస్ట్ బౌలర్ గా నిలిచారు. విక్రాంత్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ' దక్కింది. స్టయిలిష్ ప్లేయర్ గా జీవా నిలిచిచారు. విజేత టీమ్ కు చెందిన రమణ ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీ రూ.50,000 శ్రీలంక తమిళుల సహాయార్థం సిఎం ఫండ్ కు విరాళంగా ఇచ్చారు. ఆంధ్రా కింగ్స్ తరఫున వచ్చిన వచ్చిన ప్రైజ్ మనీ కూడా ఇదే కారణంగా సిఎం ఫండ్ కు విరాళంగా అందజేశారు. టాలీవుడ్, కోలీవుడ్ మధ్య ఫ్రెండ్లీ సినీస్టార్స్ క్రికెట్ జరగడం ఇదే మూడోసారి. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్ లో కోలీవుడ్ గెలుపొందగా, షార్జాలో జరిగిన రెండో మ్యాచ్ లో టాలీవుడ్ టీమ్ గెలుపొందింది. ముచ్చటగా మూడోసారి శ్రీలంక తమిళుల సహాయార్థం చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మళ్లీ కోలీవుడ్ విజయకేతనం ఎగురవేసింది.
Be first to comment on this News / Article!
|