'హీరోలకు రెస్ట్ ఎక్కువైంది'
హీరోల తీరుపై దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి చురకలు వేశారు. నేటి తరం కథానాయకులు విశ్రాంతి తీసుకోవడానికి బాగా అలవాటు పడ్డారనీ, ఒకటి రెండు సినిమాలతోనే ఊహించని పేరు, డబ్బు రావడంతో ఏడాదికి ఒక్క సినిమా చేస్తున్నారనీ, కొందరైతే అది చేయడం లేదనీ దాసరి నిశితంగా విమర్శించారు. తెలుగు చలన చిత్ర నటీనటుల సంఘం (మా) ఏర్పడి 15 ఏళ్లు అయిన సందర్భంగా హైద్రాబాద్ లో ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు స్వీకరించిన 'మా' సభ్యులకు సత్కారం జరిగింది. కృష్ణ, దాసరి నారాయణరావు, కైకాల సత్యనారాయణ, డాక్టర్ డి.రామానాయుడు, వెంకటేష్, ఛార్మి, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, ఉత్తేజ్, ఝాన్సీ తదితరులను ఈ సందర్భంగా సత్కరించారు.
దాసరి మాట్లాడుతూ, ఈనాటి హీరోలు ఏడాదికి ఒక సినిమాకే పరిమితమవుతున్నారనీ, కానీ ఆనాడు ఎఎన్ ఆర్, ఎన్టీఆర్, కృష్ణ వంటి హీరోలు రోజుకు మూడు నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ఏడాదికి వీలున్నన్ని చిత్రాలు చేసేవారని అన్నారు. బుల్లితెర అనే ప్రత్యామ్నాయం లేకపోతే పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారని దాసరి అభిప్రాయపడ్డారు. తెలుగు పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సూపర్ స్టార్ కష్ణ 'పద్మభూషణ్' అవార్డుకు అన్నివిధాలా అర్హుడనీ, దానితో పాటే ఈ ఏడాది ఆయనకు ఎన్టీఆర్, డాక్టరేట్ రావడం ముదావహమనీ అన్నారు. డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ, కళాకారులకు సత్మారాలు చేయడంతో పాటు పేద కళాకారులను ఆదుకునేందుకు తగిన వనరులను 'మా' సమకూర్చుకోలవాలని సూచించారు. తన వంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగానే నటీనటుల సంఘం కొత్తగా ఏర్పాటు చేసిన 'మాస్టార్స్ డాట్ కామ్' ను దాసరి ప్రారంభించారు. ఇందులో నటీనటులు, తెలుగు సినిమాలకు సంబంధించిన తాజా సమాచారం పొందుపరుస్తున్నట్టు 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ తెలిపారు. శ్రీమతి జమున, కృష్ణంరాజు తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. అంతకుముందు చలసాని వెంకటేశ్వరరావు రచించిన 'ఆణిముత్యాలు' పుస్కకాన్ని దాసరి నారాయణరావు ఆవిష్కరించి సహజకవి మల్లెమాలకు తొలి ప్రతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి జమున, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|