సైలెంట్ గా ఉషాకిరణ్ మూవీ
'ఈ ఉషాకిరణాలు తిమిర సంహరణాలు' అంటూ రామోజీ రావు సొంత నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ తెలుగులో పలు హిట్లు అందించి తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన క్రెడిట్ నిలుపుకొంటోంది. 'ప్రతిఘటన', 'మయూరి', 'మౌన పోరాటం' వంటి పలు హిట్లు ఈ బ్యానర్ లో ఉన్నాయి. కొత్త నటీనటులతో 'చిత్రం', 'నువ్వేకావాలి' వంటి సూపర్ హిట్లు కూడా ఈ బ్యానర్ లో ఉన్నాయి. గత కొద్దికాలంగా సరైన హిట్లు లేని ఈ సంస్థ మళ్లీ ఈమధ్యనే అంతా కొత్త నటీనటులతో అల్లరి రవిబాబు దర్శకత్వంలో 'నచ్చావులే' చిత్రాన్ని తెరకెక్కించి ఫ్లాపులను బ్రేక్ చేసింది. చిన్న చిత్రంగా విడుదలైనా మంచి విజయాన్ని ఆ సినిమా నమోదుచేసుకుంది. కొత్తవారితో సినిమాలు తీసినప్పుడల్లా విజయం సొంతం చేసుకోవడం దృష్టిలో పెట్టుకుని ఉషాకిరణ్ సంస్థ తాజాగా అంతా కొత్త వారితో మరో చిత్రాన్ని సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకువచ్చింది.
కామెడీ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడుగా పేరున్న శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఉషాకిరణ్ తాజా చిత్రం రెండ్రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రచారార్భాటాలకు దూరంగా ప్రారంభమైంది. ఇటీవల కాలంలో 'ఫోటో', 'భూకైలాస్' వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నాగేశ్వరరావు సరైన సక్సెస్ ను మాత్రం సాధించలేకపోయారు. అయితే ఈసారి ఉషాకిరణ్ బ్యానర్ పై హిట్ కొట్టేందుకు పట్టుదలగా ఉన్నారు. కామెడీ ప్రధానం సాగే ఈ చిత్రాన్ని ఆగస్టు నాటికి పూర్తి చేసి అదే నెలలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|