కమల్ చేతిలో 'ఈనాడు'
విలక్షణ నటుడు కమల్ హాసన్ తన డ్రీమ్ పిక్చర్ 'మర్మయోగి'ని బడ్జెట్ పరిధుల దృష్ట్యా ప్రస్తుతానికి వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఆయన హిందీలో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించగా విజయవంతమైన 'ఎ వెన్స్ డే' చిత్రం రీమేక్ కు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. తెలుగు వెర్షన్ కు 'ఈనాడు' అనే టైటిల్ ను కూడా ఆయన రిజిస్టర్ చేశారు. మీడియా ప్రముఖుడు రామోజీరావు తన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసినప్పటికీ కమల్ స్వయంగా ఆయనను రిక్వెస్ట్ చేసి ఆ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. ఇదే టైటిల్ తో గతంలో సూపర్ స్టార్ కృష్ణ 200వ చిత్రంగా 'ఈనాడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది.
'ఈనాడు' పేరుతో తెలుగులో ఓ రీమేక్ చేస్తున్నట్టు కమల్ సైతం ధ్రువీకరించారు. ఈ చిత్రాన్ని యుటీవీతో కలసి కమల్ సొంతంగా నిర్మించనున్నారు. కమల్ హాసన్ ఒకప్పటి 'సాగర సంగమం' చిత్రంలో బాల ఫోటోగ్రాఫర్ గా నటించిన చక్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆసక్తికరంగా తెలుగు వెర్షన్ లో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషించేందుకు అంగీకరించినట్టు సమాచారం. 'మర్మయోగి' చిత్రం కోసం కమల్ ముందుగానే వెంకటేష్ డేట్స్ తీసుకోగా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేకపోయినా ఆ డేట్స్ మాత్రం
'ఈనాడు' చిత్రానికి వెచ్చించబోతున్నారు. త్వరలోనే హైద్రాబాద్ లో గ్రేండ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు కమల్ పట్టుదలగా ఉన్నారు.
Be first to comment on this News / Article!
|