ఈ ఏడాది నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా శ్యాంప్రసాద్ రెడ్డి 'అరుంధతి' చిత్రంతో సెన్సేషన్ సృష్టించారు. విడుదల సమయంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు, రెండ్రోజులు ఆలస్యం కావడం వంటి అవరోధాలను అధిగమించిన జనవరి 16న విడుదల చేసిన 'అరుంధతి' చిత్రం ఏకగ్రీవంగా సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం ధాటికి పలు సినిమాలు చెల్లాచెదురైనా 'అరుంధతి' మాత్రం అప్రతిహతంగా 50 రోజులు పూర్తి చేసుకుని సెంచరీ దిశగా దూసుకుపోతుంది. 13 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం వివిధా భాషా చిత్రాల నిర్మాతలు పోటీపడినప్పటికీ శ్యాంప్రసాద్ రెడ్డి సొంతంగానే ఆయా భాషల్లో విడుదల చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే 'అరుంధతి' చిత్రాన్ని శరవేగంగా తమిళంలోకి అనువదించి ఈనెల 20న విడుదల చేసేందుకు శ్యాంప్రసాద్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.
అనుష్కకు తమిళనాట కూడా ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సరసన ఓ చిత్రంలో నటించేందుకు అనుష్క తాజాగా అగ్రిమెంట్ చేయడం కూడా ఆమెపట్ల తమిళ ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో 'అరుంధతి' చిత్రం తమిళనాట ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆయన తమిళంలో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని మరో నిర్మాతతో కలిసి హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు.