'పున్నమినాగు' ఆడియో
ముమైత్ ఖాన్ టైటిల్ పాత్రలో, రాజీవ్ కనకాల కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'పున్నమినాగు'. ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో మంగళవారం రాత్రి జరిగింది. మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ కు అందజేశారు. మాజీ ఎం.పి. భూమానాగిరెడ్డి ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి బెల్లంకొండ సురేష్ కు అందజేశారు. సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
ఎస్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గతంలో పలు సినిమాలకు తాము డిస్ట్రిబ్యూషన్ చేశామనీ, ఆ తర్వాత రాజకీయాల్లోనే పూర్తి సమయాన్ని వెచ్చించడం వల్ల సినీరంగం కొత్తగా అనిపిస్తోందని అన్నారు. కోదండరామిరెడ్డి, రచయిత యండమూరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన పలు హిట్ చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి హిట్ సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. క్లిప్పింగ్స్ చూస్తుంటే కోదండరామిరెడ్డి టేకింక్ లో ఉన్న గొప్పతనం అర్ధమవుతుందని సి.కల్యాణ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రం రాలేదని బెల్లంకొండ సురేష్ అన్నారు. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, చిరంజీవి నటించిన 'పున్నమినాగు' ఎంత మంచి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసనీ, మళ్లీ పాము కథాంశంతోనే ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనుకోవడం, అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం చాలా బాగా రావడం సంతోషంగా ఉందనీ చెప్పారు. ప్రపంచాన్ని వినాశనం నుంచి రక్షించే పాము కథాచిత్రమిదని యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. కొత్త కోదండరామిరెడ్డిని ఈ చిత్రంలో చూస్తారని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎ.రాజ్ కుమర్ మాట్లాడుతూ, తన రెగ్యులర్ స్టైల్ తరహాలో కాకుండా విభిన్నమైన సంగీతాన్ని ఈ చిత్రానికి అందించాననీ, అన్ని తరహాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పాటలు వచ్చాయనీ చెప్పారు. నిర్మాతలు పాండురంగారావు, ఆర్.కె.గౌడ్, ముమైత్ సోదరి జుబైదా, మాటల రచయిత వెలిగొండ శ్రీనివాస్, చిత్ర సమర్పకుడు జి.మహేశ్వరరెడ్డి, నిర్మాత జి.విజయకుమార్ గౌడ్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.బాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|