'భగవంతుడు' ఆడియో
నిజాయితీ కలిగిన ఓ పోలీసు అధికారి కథాంశంతో విజయ్, కౌష హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం 'భగవంతుడు'. ఎస్.ఎస్.కుమార్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది. శాసనసభ్యుడు కె.పి.కొండారెడ్డి ఆడియో క్యాసెట్లను ఆవిష్కరించి, తొలి క్యాసెట్ ను నిర్మాత నరసింహారెడ్డికి అందజేశారు. ఆడియో సీడీని పుట్టపర్తి అర్బన్ డెవల్ మెంట్ అథారిటీ ఛైర్మన్ కోట సత్యనారాయణ ఆవిష్కరించి తొలి సీడీని దర్శకుడు ఎస్.ఎస్.కుమార్ కు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
దర్శకుడు ఎస్.ఎస్.కుమార్ మాట్లాడుతూ యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్, వినోదం, సెంటిమెంట్ వంటి పలు అంశాలు ఇందులో మిళితమై ఉంటాయని, 'చంద్రముఖి' తరహాలో ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు. కృష్ణభగవాన్ ఎంతో ప్రాముఖ్యం ఉన్న పాత్రను షోషించగా, గ్లామర్ పాత్రలో కౌష నటన ఈ చిత్రానికి మరింత నిండుదనాన్ని తెచ్చాయన్నారు. నటుడు స్వర్గీయ హరిప్రసాద్ కు ఇది చివరి చిత్రమని పేర్కొన్నారు.
నగరంలో మాఫియా ముఠాల ఆగడాలను అరికట్టే పాత్రలో కథానాయకుడు విజయ్ ఎంతో చక్కగా నటించారు, లలిత్ సురేష్ వీనులవిందైన సంగీతాన్ని అందించారని నిర్మాత నరసింహారెడ్డి అన్నారు. విభిన్నమైన పాత్రను పోషించానని కథానాయిక కౌష పేర్కొనగా, ఆకట్టుకునే ఆరు పాటలు ఈ చిత్రంలో ఉన్నాయని సంగీత దర్శకుడు లలిత్ సురేష్ తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలో హీరో విజయ్, నటులు రఘునాథరెడ్డి, గుండు సుదర్శన్, గీత రచయిత వేల్పుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|