సోనియా కొత్తచిత్రం షురూ
'హ్యాపీడేస్', 'వినాయకుడు' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సోనియా కథానాయికగా ఓ కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమరుడు రాజీవ్ ('నోట్ బుక్' ఫేమ్ ), కృష్ణుడు ('వినాయకుడు' హీరో) హీరోలుగా నటిస్తున్నారు. శ్రీ విజయగణపతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎం.అర్జునరాజు కుమారుడు ఎం.రామలింగ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకుడు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ లో శనివారం ఉదయం ఈ చిత్రం ప్రారంభమైంది. సోనియా, రాజీవ్, కృష్ణుడుపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి డాక్టర్ డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. రమేష్ ప్రసాద్ కెమెర్ స్విచ్చాన్ చేయగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ చిత్రానికి భూపతి రాజా చాలా మంచి కథ ఇచ్చారనీ చెప్పారు. కోటి గారి అబ్బాయి రాజీవ్ ను ఓ ఫంక్షన్ లో చూసి రామలింగ రాజుకు చెప్పాననీ, మంచి కాంబినేషన్లు కుదరడంతో ఆయన తన ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ చిత్ర నిర్మాణం చేపట్టారనీ తెలిపారు. భూపతిరాజా మాట్లాడుతూ, గతంలో తాను పెద్ద హీరోలందరికీ కథలు ఇచ్చాననీ, ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా రాసిన యూత్ ఫుల్ కథాంశమిదనీ చెప్పారు. ఒక యువకుడి జీవితంలో చేటుచేసుకున్న ఓ సంఘటన అతను జీవితాన్ని ఎలా మార్చిందనే పాయింట్ తో కథ ఉంటుందన్నారు. నిర్మాత రామలింగరాజు మాట్లాడుతూ, ఇవాల్టి ట్రెంక్ కు సరిపడే కథ ఇదనీ, దర్శకుడితో తనకున్న అనుంబంధంతో సొంత బ్యానర్ స్థాపించినట్టు చెప్పారు. ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జూలైలో పూర్తి చేస్తామని చెప్పారు. రాజీవ్ మాట్లాడుతూ, ఏడాదిగా తాను, తన తండ్రి కోటి మంచి కథ కోసం చూస్తున్నామనీ, వైజాగ్ లో యాక్టింగ్ కోర్టులో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి హైద్రాబాద్ రమ్మన్నారనీ, వచ్చిన వెంటనే భూపతి రాజా చెప్పిన కథ తనకు ఎంతో బాగా నచ్చిందనీ చెప్పారు. తనకు ఈ చిత్రంలో అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలని అన్నారు. ఇందులో తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని కృష్ణుడు తెలిపారు. ఈ స్టోరీ బాగా నచ్చి సినిమా చేస్తున్నాననీ, హ్యాపీడేస్, వినాయకుడు చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే ఆశాభావంతో ఉన్నాననీ సోనియా తెలిపారు. చిత్ర మాటల రచయిత మరుధూరి రాజా, సంగీత దర్శకుడు కోటి, నటుడు కాశీవిశ్వనాథ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. అర్జునరాజు, జగపతి రాజేంద్రప్రసాద్, కోదండరామిరెడ్డి, సి.కల్యాణ్, బ్రహ్మానందం, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదతరులు సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|