ఖమ్మం చేరిన 'అధినేత'
రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల షెడ్యూల్ కు సరిగ్గా వారం రోజుల ముందు హీరో జగపతిబాబు 'అధినేత' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓ సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సముద్ర దర్శకత్వంలో కె.రాదామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్దాదాస్, హంసానందిని హీరోయిన్లు. శనివారం నుంచి ఈ చిత్రం క్లైమాక్స్ ను ఖమ్మంలో చిత్రీకరిస్తున్నారు. జగపతిబాబు, ఆహుతి ప్రసాద్, విలనీ పాత్రధారి ఆనందరాజ్ తదితర తారాగణంపై ప్రజల మధ్యన భారీ స్థాయిలో ఈ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది.
నాలుగు రోజుల పాటు ఖమ్మంలో క్లైమాక్స్ జరుగుతుందని నిర్మాత తెలిపారు. ఇందులో భాగంగా కొన్ని హెలికాప్టర్ సన్నివేశాలు కూడా ఉంటాయన్నారు. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఫైట్ , విదేశాల్లో రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోందనీ, ముందుగా అకున్నట్టే ఏప్రిల్ 10న రిలీజ్ ఉంటుందనీ చెప్పారు. నిజమైన ప్రతినిధి ఎలా ఉండాలనేది ఇందులో చూపిస్తారనీ, రాజకీయనాయకుడి పాత్రలో తొలిసారి తాను నటిస్తున్నాననీ జగపతిబాబు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నీలిమ, అన్నపూర్ణ, శివపార్వతి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరుచూరి సోదరులు కథ, మాటలు అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|