'మిత్రుడు' పాటలు ఉగాదికి
యువరత్న బాలకృష్ణతో గతంలో 'ఆదిత్య 365', 'వంశానికొక్కడు' వంటి విజయవంతమైన చిత్రాలు అందించిన వైష్ణవి సినిమా అధినేత శివలెంక ప్రసాద్ తాజాగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'మిత్రుడు'. బాలకృష్ణకు జోడిగా అందాల నటి ప్రియమణి నటిస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు మహాదేవ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లహరి ఆడియోస్ ద్వారా తెలుగు న్యూఇయర్ డే 'ఉగాది'కి ఆడియో విడుదలవుతుందని సమాచారం. ఏప్రిల్ ద్వితాయార్థంలో సినిమా విడుదలకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది.
బాలకృష్ణకు ప్రేక్షకులు, అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఇందులో కనిపిస్తారనీ, తమ బ్యానర్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేలా ఈ చిత్రం ఉంటుందనీ నిర్మాత ప్రసాద్ తెలిపారు. సినిమా ప్రథమార్థం కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటే, ద్వితీయార్థం ఎమోషనల్ డ్రామా, చక్కటి టెంపోతో సినిమాను దర్శకుడు తెరకెక్కించారని చెప్పారు. పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన కథ ఇచ్చారనీ, ఎం.రత్నం మంచి సంభాషణలు అందించారనీ చెప్పారు. బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాల తరహాలోనే ఇది కూడా మ్యూజికల్ హిట్టవుతుందన్నారు. త్వరలోనే బ్యాలెన్స్ పాటను చిత్రీకరించి సమ్మర్ కానుకగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరించడం మరో విశేషం. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, ప్రదీప్ రావత్, బాలయ్య, తనికెళ్ల భరణి, ధర్మవరపు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, హేమ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|